Begin typing your search above and press return to search.

చెవిలో కాలీప్ల‌వ‌ర్లు పెడుతున్నారంటున్నరోజా

By:  Tupaki Desk   |   25 March 2017 10:42 AM GMT
చెవిలో కాలీప్ల‌వ‌ర్లు పెడుతున్నారంటున్నరోజా
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా మ‌రోమారు సెటైర్ల‌తో కూడిన విమ‌ర్శ‌లు చేశారు. త‌న‌పై విధించిన స‌స్పెన్ష‌న్ నేప‌థ్యంలో రోజా అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు కావ‌డం లేదు. అయితే శాస‌న‌స‌భ‌ నిబంధన‌ల ప్ర‌కారం ఆమెకు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడే హ‌క్కు ఉంటుంది. ఈ హ‌క్కు ఆధారంగా మీడియా పాయింట్లో రోజా మాట్లాడుతూ అమ‌రావ‌తి నిర్మాణం, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తీరుపై మండిప‌డ్డారు. రాజ‌ధాని నిర్మాణం విష‌యంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మరో డ్రామాకు తెర లేపారని రోజా మండిప‌డ్డారు. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని, ఇంతవరకు ప్రతిపక్షం, అఖిలపక్షంతో చర్చించకుండా చంద్రబాబు నిరంకుశంగా వ్యవహరించారని రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు ఉంటే వాటిపై చర్చించకుండా రాజధాని నిర్మాణంపై గ్రాఫిక్స్‌ డిజైన్లు అంటూ కాలయాపన చేస్తున్నారని, అందుకే ఆ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌కు వైఎస్‌ఆర్‌సీపీ దూరంగా ఉందని రోజా తెలిపారు. అమ‌రావ‌తి విష‌యంలో ఉసరవెల్లిలాగా రోజుకో రంగు మార్చుతూ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు.

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని నిర్మాణంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్ ఇస్తున్నామంటూ చాలా పెద్ద మనసుతో ప్రతిపక్షాన్ని ఇందుకు పిలిచామని టీడీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గు చేటని రోజా మండిప‌డ్డారు. ప్రజలకు గ్రాఫిక్స్‌ చూపి మభ్యపెడుతున్నారని, ఇందులో ముందు పొగ గొట్టాల డిజైన్ల్‌ చూపించారన రోజా ఎద్దేవా చేశారు. ఆ డిజైన్లు ఇచ్చిన‌ మాకీ సంస్థను ఎందుకు మార్చారని ఆమె ప్రశ్నించారు. "రాజ‌ధాని నిర్మాణం విష‌యంలో ఇప్పటి వరకు రెండు గ్రాఫిక్స్‌ చూపించారు. ఇవాళ మరో కొత్త గ్రాఫిక్స్‌ తీసుకొని వచ్చారు. రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యలు ఉంటే వాటిపై చర్చించకుండా బహుబలి 1 - 2 - 3 అని గ్రాఫిక్స్‌ చూపిస్తున్నారు. రాజధానిలో డిజైన్లలో 51 శాతం గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకునే చంద్రబాబు మూడు పంటలు పండే 33వేల ఎకకాల భూమిని లాక్కుని ఎక్కడ నుంచో తెచ్చి చెట్లు పెడతానని చెవిలో కాలీఫ‍్లవర్లు పెడుతున్నారు" అంటూ రోజా ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయని, ఏ కీల‌క కార్యక్రమం చేపట్టిన అన్ని పార్టీలను పిలిచి చర్చించేవార‌ని, అందరి అభిప్రాయాలను స్వీకరించేవారని రోజా గుర్తు చేశారు. కానీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అలాంటి సంప్ర‌దాయాల‌ను తుంగ‌లో తొక్కార‌ని మండిప‌డ్డారు.

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రానికి మంచి రాజధాని నిర్మించేందుకు శివరామకృష్ణ కమిటీ నివేదికలు అందిస్తే..వాటి గురించి చర్చించేందుకు చంద్రబాబుకు మనసు రాలేదని రోజా మండిప‌డ్డారు. "33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూములు లాక్కొని ఈ రోజు గ్రీనరీకి ఉపయోగిస్తారట. అందులో ప్లాస్టిక్‌ పూలు పెడతారట. కానీ ప్రస్తుతం చూస్తే ....రాజధాని ప్రాంతంలో నిలువ నీడ లేదు. పోలీసులు, సందర్శకులు ఎండలో మాడిపోతున్నారు.మహిళా సభ్యులకు మరుగుదొడ్లు లేవు. మహిళా పోలీసులు అవస్థలు పడుతున్నారు.బాబుకు రాజధాని కట్టాలనే ఉద్దేశం లేదు, అందుకే ఇలా బొమ్మలు చూపుతూ కాలయాపన చేస్తున్నారు. న‌వ్యాంధ్రకు రాజధాని నిర్మించే సామర్థ్యం వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికే ఉంది. అందుకే ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. చంద్రబాబు హైదరాబాద్‌ లో ఇల్లు కట్టుకుంటూ...ఇక్కడ మాత్రం కరకట్టపై నివసిస్తున్నారు" అని రోజా వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/