Begin typing your search above and press return to search.

రోజా వేసిన ఆ మూడు ప్ర‌శ్న‌లు!

By:  Tupaki Desk   |   18 Jun 2018 1:32 PM GMT
రోజా వేసిన ఆ మూడు ప్ర‌శ్న‌లు!
X
రాజ‌కీయాలు ఒక నిరంత‌ర ప్ర‌క్రియ‌. ప్ర‌త్య‌ర్థుల‌కు దాటి ముందుకు పోవాలంటే ప్ర‌తిక్ష‌ణం అలెర్ట్‌గా ఉండాలి. ఎదుటి వారి చ‌ర్య‌లు నిశితంగా గ‌మ‌నించాలి. అలాంటి తీక్ష‌ణత ఉన్న‌పుడే చ‌క్క‌గా మాట్లాడ‌గ‌లుగుతారు. లేదంటే... అస‌లైన సంద‌ర్భాల్లో నోరెళ్లబెట్టాల్సి వ‌స్తుంది. రోజా ఈ విష‌యంలో ఘ‌నాపాటి. రోజు మాట్లాడితే కౌంట‌ర్ ఇవ్వ‌డం క‌ష్ట‌మే. కేవ‌లం త‌న మాట‌కారిత‌నం - అనుశీల‌న‌ - అవ‌గాహ‌న వల్ల రోజా చాలా మంది సీనియ‌ర్ల కంటే ప్ర‌జ‌ల్లో ఎక్కువ ఆద‌ర‌ణ క‌లిగి ఉన్నారు. ఒక‌వైపు త‌న వినోద‌పు కెరియ‌ర్‌ను కాపాడుకుంటూనే రాజ‌కీయాల్లో సీనియ‌ర్ల‌కు తీసిపోని విధంగా న‌డుచుకుంటారు. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై రోజా స్పందించారు. ఆమె మాట‌ల్లో మూడు ముఖ్య‌మ‌యిన ప్ర‌శ్న‌ల‌కు టీడీపీ స‌మాధానం చెబితే చాలు.

1. ఇటీవల ఢిల్లీలో ప్రధాని ఇంటిని ముట్టడించేందుకు వెళ్లి ముందే మీడియాకు చెప్పి అరెస్టు డ్రామాలు ఆడారన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు.. మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలోనే హోదా, విభజన హామీలపై గట్టిగా ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. వంగి వంగి న‌మ‌స్కారాలు పెడుతున్నాడంటే ఆయ‌న ఎన్ని త‌ప్పులు చేశాడో, ఇంత భ‌య‌ప‌డే ముఖ్య‌మంత్రి ఇక ప్ర‌ధానిని నిల‌దీసి రాష్ట్రానికి ఏం సాధించుకువ‌స్తారు?

2. ఇప్పుడు జాతీయ మీడియా కూడా చంద్రబాబు తీరును తప్పుబట్టింది. అందుకే నీతి ఆయోగ్ స‌మావేశం అయ్యాక క‌నీసం ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా పారిపోయారు చంద్ర‌బాబు. నీతి ఆయోగ్‌ను బహిష్కరించాలన్న నలుగురు సీఎంలు మోడీని చూడగానే ఎందుకు నమస్కరించారు? అంత‌గా సరెండర్ అయిపోయిన విషయం అంద‌రూ చూశారు? ఆ ర‌హ‌స్యం ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి! ఇలా మోడీకి ఇంత లొంగే బాబు... జగన్ బీజేపీతో లాలూచీపడ్డారని తన మీడియాలో ఏ విధంగా చంద్రబాబు బురద జల్లుతారు?

3. ఆంధ్రజ్యోతి సర్వే చూస్తుంటే టీడీపీ వాళ్లు సోషల్ మీడియాలో క్రియేట్ చేసుకున్న సర్వేను పేపర్లలో వేసినట్లుగా కనిపిస్తోంది. నిన్న టీవీలో న‌గ‌రిలో నేను గెలుస్తాన‌ని ఆర్కే పెద్ద మ‌న‌సు చేసుకుని వేశారు. రాత్రి చంద్ర‌బాబు తిట్టారేమో పొద్దున్నే ఫ్లేటు ఫిరాయించారు. వైసీపి బాగుంది గానీ రోజా గెల‌వ‌ద‌ని పొద్దున రాశారు... ఇవి టీడీపీ రాత‌లు కాక ఇంకేవిటి? వైసీపీ ప్ర‌భ‌జంనం చూసి క‌లిగిన భయం కాదా ఇది?

ప్ర‌గ‌ల్భాలు ప‌లికి ఢిల్లీకి వెళ్లిన ముఖ్య‌మంత్రిని దుమ్ముదులిపేసిన రోజా పార్టీని నిల‌బెట్టుకోవ‌డానికి ఎంపీలను ఎలా కొందామా? పక్క పార్టీ వారిని ఎలా ఆక‌ర్షిద్దామా? అనే ఆలోచన త‌ప్ప‌ టీడీపీకి మ‌రో ఆలోచ‌న లేద‌న్నారు. ఇక ఆక‌ర్ష‌లు ప‌నిచేయ‌క‌పోవ‌డంతో ఇపుడు కొత్త ఆరోప‌ణ‌లు మొద‌లుపెట్టారు. తాను జ‌న‌సేన‌లోకి వెళ్తున్న‌ట్టు ప్రచారం చేయిస్తోంది టీడీపీయే. అభ్య‌ర్థులు కూడా దొర‌క‌ని జనసేనలోకి వెళ్లే అవసరం త‌న‌కు ఏముందో ప్రజలు ఆలోచించ‌గ‌ల‌రు. ప‌వ‌న్‌కు వ‌చ్చిన స్పంద‌న ఏంటి? రాజ‌మ‌హేంద్ర‌వ‌రం బ్రిడ్జిని ఊపేసిన వైసీపీ ప్ర‌భంజ‌నం ఏంటో అంద‌రికీ తెలుసు అని రోజా వ్యాఖ్యానించారు.