చరిత్రలో వాళ్ల సరసనే బాబు అన్న రోజా

Sat Aug 12 2017 10:00:00 GMT+0530 (IST)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తప్పు పడుతున్న వారికి సమాధానం ఇస్తూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు అని ఎలా అంటారంటూ నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును ప్రజా కోర్టులో నిలదీసిన జగన్మోహన్ రెడ్డిది తప్పని ఎలా విమర్శిస్తారని నిలదీశారు.కుట్రలకు.. కుతంత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబేనన్న విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికిన ఆమె.. గుంటనక్క.. ఊసరవెల్లి అనేందుకు బాబుకే పేటెంట్ రైట్స్ ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని ఏపీలోని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారంటూ రోజా మండిపడ్డారు. నైతిక విలువలు లేని తెలుగుదేశం పార్టీ నేతలకు జగన్ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు.

రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్న సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పని చేశారని.. అప్పట్లో ఆయన ప్రయత్నాల్ని చంద్రబాబు అడ్డుపడ్డారన్నారు. అలాంటి చంద్రబాబు ఈ రోజున రాయలసీమకు తానే నీళ్లు ఇచ్చినట్లు చెప్పుకోవటం సరికాదన్నారు.

నంద్యాలలో జగన్ చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ నేతలు తప్పు పడుతున్నారని.. అసలు జగన్ ఏమన్నారు..? 600 హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబును పబ్లిసిటీ పిచ్చితో 29 మంది పుష్కర భక్తులను చంపేసిన బాబును న్యాయమూర్తులుగా ప్రజలే శిక్షించాలని మాత్రమే అన్నారన్నారు.

జగన్ చేసిన వ్యాఖ్యలో ఏదో తప్పున్నట్లు.. చంద్రబాబు ఏదో మంచివారైనట్లుగా తెలుగుదేశం నేతలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పురాణాల్లో రావణుడ్ని చూశామని.. చరిత్రలో తండ్రిని చంపిన ఔరంగజేబును చూశామని.. మహాత్ముడ్ని పొట్టన పెట్టుకున్న గాడ్సేను కూడా చూశామన్న రోజా.. ఆ కోవకు చెందిన వ్యక్తే చంద్రబాబు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  సొంత మామను వెన్నుపోటు పొడవటం మొదలు.. అడ్డు వచ్చిన కుటుంబ సభ్యులపై సొంత మీడియాతో బురద జల్లించటం.. చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోవటం..  కాంగ్రెస్ తో కుమ్మక్కై వైఎస్ జగన్ పై కేసులు బనాయించటం లాంటి పాపాలకు అంతే లేదన్నారు.

శవాల మీద రాజకీయ పునాదులు నిర్మించుకున్న టీడీపీ నేతలకు వైఎస్ జగన్ ను విమర్శించే అర్హతే లేదన్న రోజా..  తాను అధికారంలోకి వస్తే ప్రజాభీష్టం మేరకు కేసీ కెనాల్‌కు తుంగభద్ర నుంచి సరిపడేలా నీటి స్థిరీకరణ చేపడతామని జగన్ హామీ ఇస్తుంటే.. ఇది అవసరమా అని బాబు అడ్డుపడుతున్నారన్నారు.

తాను చనిపోయినట్లుగా కొందరు సోషల్ మీడియాలో శ్రద్దాంజలి పెడుతున్నారంటూ మండిపడిన రోజా.. వీళ్లు అసలు మనుషులేనా? అని ప్రశ్నించారు. ఉన్మాదికి ఫ్యాంటు.. షర్టు వేస్తే చంద్రబాబు అని.. ఉన్మాదుల్లో ప్రవర్తిస్తున్న మంత్రులు.. ఎమ్మెల్యేలకు నంద్యాల ప్రజలు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.