రోజా మాట!..మగాళ్లను చంపడమే బాబు లక్ష్యం!

Mon Nov 20 2017 15:12:03 GMT+0530 (IST)


వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు - ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా... టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై తన మాటల తూటాలను మరోమారు ఎక్కు పెట్టారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఓ కన్నేసి ఉంచుతున్న రోజా... సమయం చిక్కితే... నేరుగా చంద్రబాబునే టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేయడం మనకు కొత్తేమీ కాదు. గతంలో చాలాసార్లు చంద్రబాబును టార్గెట్ చేస్తూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొన్ని సార్లు ఆమె పంచ్ డైలాగులు హిట్టయితే... మరికొన్ని సార్లు ఆమె ఇబ్బందుల్లో పడిపోయారన్న వాదన కూడా లేకపోలేదు. గతం విషయం పక్కన పెడితే... తాజాగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ రోజా చేసిన ఘాటు వ్యాఖ్యలు పెను కలకలాన్నే రేపుతున్నాయి.అయినా చంద్రబాబుపై రోజా ఎలాంటి కామెంట్లు - ఏ అంశాన్ని ఆధారంగా చేసుకుని సంధించారన్న విషయంలోకి వెళితే... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా హుసేనాపురంలో జగన్ నిర్వహించిన మహిళా సదస్సులో రోజా అధ్యక్షోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న మద్యం పాలసీని టార్గెట్ గా చేసుకుని రోజా ఆసక్తికర వాదన వినిపించారు. జాతీయ రహదారుల వెంట మద్యం దుకాణాల ఏర్పాటు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశించిన ఈ నిబంధన రాష్ట్రంలో ఎక్కడైనా అమలవుతోందా? అని సూటిగా ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నిబంధనను తుంగలో తొక్కేసిన చంద్రబాబు సర్కారు... జాతీయ రహదారుల వెంట మద్యం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చేసిందని ఆరోపించారు. ప్రతి 50 వేల మందికి ఓ మద్యం షాపును ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతోనే బాబు సర్కారు ముందుకు సాగుతోందని రోజా దుయ్యబట్టారు. వెరసి రాష్ట్రంలో మగాళ్ల (పురుషుల) ప్రాణాలు తీసేందుకు బాబు కంకణం కట్టుకున్నారని ఆమె ఆరోపించారు.

మద్యం విక్రయాల ద్వారా ఆదాయాన్ని రాబట్టుకునేందుకు చంద్రబాబు సర్కారు సుప్రీంకోర్టు నిబంధనలకు కూడా తూట్లు పొడిచిందని విమర్శించారు. బాబు విధానాల వల్ల కుటుంబాల్లో గొడవలు పెరిగిపోయాయని ఇంట్లోని మగాడు మద్యానికి బానిసగా మారితే... ఆ ఇంట్లో గొడవలు కాకుండా ఇంకేం ఉంటాయని కూడా ఆమె ప్రశ్నించారు. మొత్తంగా మద్యాన్ని వీధి వీధికి విస్తరించేసిన చంద్రబాబు... అదే మద్యం చేత మగాళ్లను చంపేస్తున్నారని రోజా విరుచుకుపడ్డారు. తమ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని రోజా ప్రకటించారు. ఈ మేరకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే దీనిపై ఓ స్పష్టమైన హామీ ఇచ్చారని మాట ఇస్తే... మడమ తిప్పేది లేదని కూడా రోజా కాస్తంత ఆవేశంగానే ప్రసంగించారు. మరి రోజా కామెంట్లపై టీడీపీ నేతలు ఎలాంటి కౌంటర్లు సంధిస్తారో చూడాలి.