Begin typing your search above and press return to search.

రోజా క్వ‌శ్చ‌న్‌!..బాల‌య్య‌ను ఎందుకు అడ‌గ‌రు?

By:  Tupaki Desk   |   22 April 2018 8:14 AM GMT
రోజా క్వ‌శ్చ‌న్‌!..బాల‌య్య‌ను ఎందుకు అడ‌గ‌రు?
X

ఏపీలో అధికార పార్టీ టీడీపీ - విప‌క్షం వైసీపీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో పాటు ఏకంగా సీఎం స్థానంలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు తీసుకుంటున్న ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌ను బ‌హిరంగంగానే ఎండ‌గ‌డుతున్న వైసీపీ సంధిస్తున్న ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్లు మాత్రం బ‌య‌ట‌కు రావడం లేద‌న్న వాద‌న వినిస్తోంది. అస‌లు రాష్ట్రంలో తాము చేసిందే పాల‌న‌ - తాము తీసుకున్న నిర్ణ‌యాలు మాత్ర‌మే స‌రైన‌వ‌న్న కోణంలో వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబు స‌ర్కారు... విప‌క్షం ఒక‌టుంద‌న్న భావ‌నే లేకుండా ఇష్టారాజ్యంగా పాల‌న సాగిస్తోంద‌న్న వాద‌న కూడా అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఈ క్ర‌మంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండలికి కొత్త కార్య‌వ‌ర్గాన్ని నియ‌మించిన బాబు స‌ర్కారు... స‌ద‌రు కార్య‌వ‌ర్గంలోని స‌భ్యుల‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌ల‌పై మాత్రం నోరు విప్పేందుకు సిద్ధంగా లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. హిందువే కాని పుట్టా సుధాకర్ యాద‌వ్‌ ను టీటీడీ చైర్మ‌న్‌ గా ఎలా నియ‌మిస్తార‌ని ఇప్ప‌టికే పెద్ద ఎత్తున వివాదం న‌డ‌వ‌గా... ఆ కోణంలో వినిపించిన విమ‌ర్శ‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోకుండానే పుట్టాకే ఆ ప‌ద‌విని క‌ట్ట‌బెడుతూ చంద్ర‌బాబు స‌ర్కారు మొన్న అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

పుట్టా సుధాకర్ యాద‌వ్ పై వెల్లువెత్తిన విమ‌ర్శ‌లు అలాగే ఉండ‌గా... అంత‌కు ఎక్కువ రెట్ల వివాదాన్ని కొని తెచ్చుకున్న బాబు స‌ర్కారు... టీడీపీ ఎమ్మెల్యేలు వంగ‌ల‌పూడి అనిత‌ - బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావుల‌ను స‌భ్యులుగా నియ‌మించింది. ఈ క్ర‌మంలో తాను క్రిస్టియ‌న్ ను అంటూ గ‌తంలో ఓ సంద‌ర్భంగా స్వ‌యంగా అనిత చెప్పిన వీడియో ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చేసి వైర‌ల్‌ గా మారిపోయింది. ఇక హిందూ సంప్ర‌దాయాలే తెలియ‌ని బొండాను టీటీడీలో స‌భ్యుడిగా ఎలా నియ‌మిస్తార‌ని కూడా వివిధ వ‌ర్గాలు ప్ర‌శ్నిస్తున్నాయి. ఈ విమ‌ర్శ‌ల‌పై ఏమాత్రం స్పందించ‌ని టీడీపీ స‌ర్కారు మౌన ముద్ర‌లో ఉండిపోయింది. ఈ వైనంపై ఫైరైపోయిన వైసీపీ ఫైర్ బ్రాండ్‌ - చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా త‌న‌దైన శైలిలో ఫైర‌య్యారు. తిరుమ‌ల వెంక‌న్న‌నే నేటి ఉద‌యం ద‌ర్శించుకున్న త‌ర్వాత ఆల‌యం వెలువ‌ల మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా ఆమె చంద్ర‌బాబు స‌ర్కారు తీరును క‌డిగిపారేశార‌ని చెప్పాలి. టీటీడీ పాల‌క‌మండ‌లిలో స‌భ్యుల నియామ‌కాల‌తో హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయని ఆరోపించిన ఆమె... పాల‌క‌మండ‌లి నియామ‌కంపై ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీటీడీపీ పాల‌క‌మండ‌లిపై అన్ని వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వినిపిస్తుంటే... బాబు మాత్రం నోటికి తాళ‌మేసుకుని కూర్చున్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇప్ప‌టికైనా బాబు నోరు తెర‌వాల్సిందేన‌ని డిమాండ్ చేసిన ఆమె... పాల‌క‌మండ‌లి స‌భ్యుల నియామ‌కంపై ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇవ్వ‌క త‌ప్ప‌ద‌ని తేల్చేశారు. ఇక ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన కాస్టింగ్ కౌచ్‌ పైనా త‌న‌దైన శైలిలో స్పందించిన రోజా... ఈ విష‌యంలో ఒక్క ప‌వ‌న్ కల్యాణ్ ను మాత్ర‌మే లాగ‌డ‌మెందుక‌ని ఆమె ప్ర‌శ్నించారు. నంద‌మూరి ఫ్యామిలీ వార‌సుడిగా - సీనియ‌ర్ న‌టుడిగా - అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నంద‌మూరి బాల‌కృష్ణ‌ను ఎందుకు ప్ర‌శ్నించ‌ర‌ని కూడా ఆమె త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేశారు. కాస్టింగ్ కౌచ్‌ కు సంబంధించి ఇప్ప‌టిదాకా జ‌రిగిన ప‌రిణామాల‌ను చూస్తుంటే... ప‌వ‌న్‌ ను చంద్ర‌బాబు టార్గెట్ చేశారన్న భావ‌న క‌లుగుతోంద‌ని ఆమె ఆరోపించారు. స్వ‌లాభం కోసం ప‌వ‌న్‌పై వ్యక్తిగ‌త దూష‌ణ‌లు స‌రికాదని ఆమె చెప్పారు. ప‌బ్లిసిటీ కోసం ప‌రువు తీస్తే... ఊరుకోబోమ‌ని కూడా ఆమె కాస్తంత తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. రాజ‌కీయంగా త‌మ‌కు ప‌వ‌న్ తో విబేధాలున్నా... వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌కు స‌పోర్ట్ చేస్తామ‌ని కూడా రోజా చెప్పారు.