Begin typing your search above and press return to search.

రోజా న్యాయ‌పోరాటం మొద‌లెట్టారుగా!

By:  Tupaki Desk   |   21 Feb 2017 9:09 AM GMT
రోజా  న్యాయ‌పోరాటం మొద‌లెట్టారుగా!
X
వైసీపీ మ‌హిళా నేత‌ - ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మ‌రోమారు న్యాయ‌పోరాటం మొద‌లెట్టేశారు. ఇప్పటికే అసెంబ్లీ నుంచి త‌న‌ను ఏడాది పాటు స‌స్పెండ్ చేసిన వైనంపై సుదీర్ఘ న్యాయ‌పోరాటం చేసిన రోజా... తాజాగా మొన్న‌టి మ‌హిళా పార్ల‌మెంటుకు హాజ‌రైన త‌న‌ను నిలిపివేసిన పోలీసులు - ఏపీ ప్ర‌భుత్వంపై పోరాటం మొద‌లెట్టారు. ఈ మేర‌కు నేటి ఉద‌యం విజ‌య‌వాడ వ‌చ్చిన ఆమె... తొలుత మీడియాతో మాట్లాడిన అనంత‌రం ఆమె నేరుగా గ‌న్న‌వ‌రం కోర్టుకు వెళ్లారు. మొన్న‌టి మ‌హిళా పార్ల‌మెంటు స‌ద‌స్సుకు హాజ‌రుకావాల‌ని స్వ‌యంగా స్పీక‌ర్ కార్యాల‌యం నుంచి త‌న‌కు రెండు ఆహ్వానాలు అందాయ‌ని - ఆ మేర‌కే తాను స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యేందుకు వ‌చ్చాన‌ని, అయితే పోలీసులు మాత్రం త‌న‌ను నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అడ్డుకున్నార‌ని ఆమె కోర్టుకు ఫిర్యాదు చేశారు. త‌న‌ను నిబంధ‌న‌ల విరుద్ధంగా అడ్డుకున్న పోలీసుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా కోర్టును కోరుతూ ఓ ప్రైవేట్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఓ మ‌హిళా ఎమ్మెల్యేగా మ‌హిళా పార్ల‌మెంటు స‌ద‌స్సుకు హాజ‌రయ్యే హ‌క్కుంద‌ని, అయితే త‌న‌కు రాజ్యాంగప‌రంగా సంక్ర‌మించిన హ‌క్కును ఏపీ పోలీసులు కాల‌రాశార‌ని రోజా ఫిర్యాదు చేశారు. స‌ద‌స్సుకు హాజ‌రుకావాల‌ని ఆహ్వానాలు పంపిన త‌ర్వాత కూడా త‌న‌ను ఎలా అడ్డుకుంటారని ఆమె ప్ర‌శ్నించారు. ఓ వైపు ఆహ్వానాలు పంపి - మ‌రోవైపు స‌ద‌స్సు వేదిక‌కు చేర‌కుండానే త‌న‌ను అడ్డుకోవ‌డం వెనుక ప్ర‌భుత్వ కుట్ర‌పూరిత ధోర‌ణి దాగుంద‌ని ఆమె కోర్టుకు విన్న‌వించారు. త‌న‌ను అడ్డుకున్న పోలీసులు, వారికి ఆ త‌ర‌హా ఆదేశాలు జారీ చేసిన డీజీపీ - చంద్ర‌బాబు స‌ర్కారుపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాల‌ని ఆమె కోర్టును అభ్య‌ర్థించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/