రోజా క్వశ్చన్!..బాబుకు ఆ మాత్రం దమ్ము లేదా?

Mon Apr 09 2018 15:12:59 GMT+0530 (IST)


ఏపీకి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమాన్ని విపక్ష వైసీపీ నిజంగానే తారా స్థాయికి తీసుకెళ్లిందని చెప్పక తప్పదు. నాలుగేళ్లుగా బీజేపీ సర్కారులో భాగస్వామిగా కలిసి నడిచిన అధికార టీడీపీ ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే సరిపోతుందని హోదా కంటే కూడా ప్యాకేజీనే మేలన్న మాటను మొన్నటిదాకా వినిపించిన సంగతి తెలిసిందే. టీడీపీ మెతక వైఖరి కారణంగానే నరేంద్ర మోదీ సర్కారు ఏపీ పట్ల చాలా ఉదాసీన వైఖరితో ముందుకు సాగుతోందన్న వాదన కూడా లేకపోలేదు. అయితే మొన్నటి కేంద్ర బడ్జెట్ లో ఏపీ ప్రస్తావనను కూడా తీసుకురాని మోదీ సర్కారు... ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలకూ ఆగ్రహాన్ని తెప్పించిన సంగతి తెలిసిందే. మోదీ సర్కారు వైఖరిని నిరసిస్తూ వైసీపీ సహా ఇతర రాజకీయ పార్టీలు - ప్రజా సంఘాలు కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేశాయి. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ కూడా మోదీ సర్కారుపై ఎదురు దాడికి దిగక తప్పని పరిస్థితి. అయితే ప్రత్యేక హోదా కోసం ఆది నుంచి తనదైన శైలి పోరాటాన్ని సాగిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... మరో సంచలన ప్రకటన చేస్తూ ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసేస్తారని ప్రకటించేశారు.ఈ ప్రకటన టీడీపీలో పెద్ద గుబులునే రేపిందని చెప్పాలి. అంతేకాకుండా ఏపీకి అన్యాయం చేసిన నరేంద్ర మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని కూడా జగన్ ప్రకటించారు. ఈ ప్రకటనకు మరింతగా జడిసిపోయిన టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని ప్రకటించారు. అయితే ఏమైందో తెలియదు గానీ... తెల్లారే సరికి వైసీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోమని తామే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని కూడా బాబు ప్రకటించిన వైనం నిజంగానే రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పక తప్పదు. ఈ క్రమంలో వైసీపీతో పాటు టీడీపీ కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా టీడీపీ కూడా అదే పనిచేసింది. అయితే ఈ రెండు తీర్మానాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపైనా చర్చకు అనుమతించన బీజేపీ సర్కారు పార్లమెంటులో రసవత్తర రాజకీయాన్ని నడిపేసింది. దీంతో విసిగిపోయిన వైసీపీ తాను ఇచ్చిన మాట ప్రకారం తమ ఎంపీలతో రాజీనామాలు చేయించేసింది. ఆ తర్వాత ఢిల్లీలోనే మకాం వేసిన వైసీపీ ఎంపీలు ఏపీ భవన్ వేదికగా ఆమరణ నిరాహార దీక్షలకు దిగారు.

ఈ పరిణామాలన్నింటినీ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్న టీడీపీ ఎంపీలు కూడా ఢిల్లీని వదిలి వచ్చేందుకు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో అక్కడే పలు రకాలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముట్టడికి యత్నించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ పోలీసులు టీడీపీ ఎంపీలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించేశారు. ఇక వైసీపీ ఎంపీల దీక్షలకు సంఘీభావంగా ఢిల్లీ చేరిన ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేటి ఉదయం ఏకంగా ఏంపీలతో పాటు దీక్షకు దిగారు. విజయమ్మతో పాటు ఢిల్లీ వెళ్లిన వైసీపీ ఫైర్ బ్రాండ్ - నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా... టీడీపీ సర్కారు - ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కోరుతూ వైకాపా ఎంపీలతో రాజీనామా చేయించామని అదే పనిని చంద్రబాబు ఎందుకు చేయించడం లేదని ఆమె మండిపడ్డారు.

తన పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దమ్మూ ధైర్యం చంద్రబాబుకు లేవా రోజా ప్రశ్నించారు. కావాలనే మోదీ ఇంటివరకూ వెళ్లిన టీడీపీ ఎంపీలు వారంతట వారే అరెస్ట్ అయి డ్రామాలు ఆడుతున్నారని ప్రజలు వారికి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తూ పదవులను వదులుకుంటుంటే టీడీపీ ప్రజల పక్షాన్ని వదిలేసి పదవులను పట్టుకు వేలాడుతోందని ఆరోపించారు. ఎంపీలంతా రాజీనామాలు చేస్తే కేంద్రం దిగివస్తుందని కానీ తనపై ఉన్న కేసుల భయంతో చంద్రబాబు బీజేపీ ముందు నాలుగేళ్ల పాటు తలొగ్గి నిలబడ్డారని ఇప్పుడు తప్పదన్న పరిస్థితుల్లో తూతూమంత్రంగా నిరసనలు చెప్పిస్తున్నారని రోజా సంచలన ఆరోపణలు చేశారు. మరి రోజా ఆరోపణలకు టీడీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.