Begin typing your search above and press return to search.

రోహింగ్యాల‌కు పౌర‌స‌త్వం.. సూచీ స్వీట్ మెసేజ్‌

By:  Tupaki Desk   |   20 Sep 2017 6:17 AM GMT
రోహింగ్యాల‌కు పౌర‌స‌త్వం.. సూచీ స్వీట్ మెసేజ్‌
X
అవును! ప్ర‌స్తుతం కొన్నాళ్లుగా వార్త‌ల్లో నిలుస్తున్న రోహింగ్యా ముస్లిం శ‌ర‌ణార్థులు ఇక బెంగ పెట్టుకోన‌క్క‌ర్లేదు. వారినీ మ‌నుషులుగా గుర్తించే ఏర్పాట్లు చ‌కాచ‌కా జ‌రిగిపోతున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా రోహింగ్యాల గురించి వెల్లువెత్తిన సానుభూతి ప‌వ‌నాలు మ‌య‌న్మార్‌ను క‌దిలించాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రోహింగ్యా పేరు వింటేనే మండిప‌డుతున్న ఆ దేశం, ఆ దేశ సైన్యం తాజాగా నెమ్మ‌దించాయి. వారిని అక్కున చేర్చుకునేందుకు రెడీ అయ్యాయి. ఇదే విష‌యాన్ని మ‌య‌న్మార్ మాన‌వ హ‌క్కుల నేత, ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆంగ్ శాన్ సూచీ వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో దాదాపు 30 నిమిషాలు మాట్లాడిన సూచీ.. రోహింగ్యాల విష‌యంపై చాలా ఆర్ద్ర‌త‌గా స్పందించారు.

మయన్మార్‌లో జరిగిన ఘర్షణల కారణంగా ఆగస్టు 25 నుంచి దాదాపు 4.10 లక్షల మంది రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు వలస వెళ్లారు. దీంతో మ‌య‌న్మార్ తిరిగి రోహింగ్యాలను త‌న దేశంలోకి రానివ్వడానికి అభ్యంతరం చెబుతోంది. ఇదే అంశాన్ని ప్ర‌స్తావించిన సూచీ రోహింగ్యా వలసలపై మాట్లాడుతూ.. ‘మత ఘర్షణల కారణంగా మయన్మార్‌ విడిపోవడాన్ని తాము ఎంతమాత్రం సహించం. ఘర్షణల ప్రభావం రోహింగ్యా ముస్లింలు నివసించే గ్రామాలపై ఎంతమాత్రం పడలేదు. వారికి పౌరసౌత్వం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం. ఇక్కడి పరిస్థితులను కావాలంటే ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులు వచ్చి పరిశీలించవచ్చు.’ అని ఆమె అన్నారు.

నిజానాకి మయన్మార్‌లోని రఖైన్‌ రాష్ట్రానికి చెందిన ప్రజలే ఈ రోహింగ్యా ముస్లింలు. వీరికి ఏ దేశపు పౌరసత్వమూ లేదు. దీంతో వీరిని శరణార్థులుగా పరిగణిస్తున్నారు. మయన్మార్‌ నుంచి వీరిని తరిమేసేందుకు సైన్యం దాడులు చేయడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు అటు తిరిగి ఇటు తిరిగి.. భార‌త్‌, బంగ్లాదేశ్ స‌హా ప‌లు దేశాల‌కు వ‌ల‌స బాట‌ప‌ట్టారు. అయితే, మ‌య‌న్మార్‌తో భార‌త్‌కు ఉన్న స‌త్సంబంధాల రీత్యా.. రోహింగ్యాల‌కు వ్య‌తిరేకంగానే భార‌త్ కూడా గ‌ళం విప్పుతోంది. దాదాపు 40 వేల మంది రోహింగ్యాలు భార‌త్‌లో ఉన్నార‌ని, వీరికి ఉగ్ర‌వాదుల‌తో సంబంధాలు కూడా ఉన్నాయ‌ని ఇటీవ‌ల భార‌త ప్ర‌భుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇక‌, ఇప్పుడు ఆంగ్ శాన్ సూచీ ప్ర‌క‌ట‌న‌తో రోహింగ్యాలు కూడా మ‌నుషులేన‌ని తేలింద‌ని హ‌క్కుల నేత‌లు అంటున్నారు. నిజ‌మే క‌దా!!