నోట్ల రద్దు హర్ట్ చేసిందంటున్న అల్లుడుగారు

Tue Jan 10 2017 12:28:55 GMT+0530 (IST)

పెద్దనోట్ల రద్దుపై  కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా తెగ బాధపడిపోయారు. నోట్ల రద్దు జరిగి సుమారు రెండు నెలల తర్వాత ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ ఇది తప్పుడు నిర్ణయమని పేర్కొన్నారు. రూ.500 - రూ.1000 నోట్ల రద్దు ఓ తప్పుడు నిర్ణయమని అది మరిన్ని పొరపాటు నిర్ణయాలకు పురిగొల్పిందని వాద్రా ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం కేంద్రం నిరాశలో ఉన్నదని విమర్శించారు. ఎవరితోనూ చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుందని రాబర్ట్ వాద్రా ఆరోపించారు.

కాగా నోట్ల రద్దు అనంతర పరిణామాలపై సైతం వాద్రా స్పందించారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని చెప్తూనే....సర్ చార్జి విధింపుతో పెట్రోల్ బంకుల యజమానులు కార్డుల లావాదేవీలను నిరాకరిస్తుండటం ఇప్పుడు మరో సంక్షోభానికి తెర తీసిందని వాద్రా ఆరోపించారు. దేశ ప్రజలందరినీ ఇక్కడ పాలు చేసిన ఈ నిర్ణయాన్ని కొందరు విప్లవాత్మక నిర్ణయంగా పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందని వాద్రా వ్యాఖ్యానించారు.

ఇదిలాఉండగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మరోమారు తనదైన శైలిలో ఈ పరిణామంపై రియాక్టయ్యారు. బెంగాల్ లో ఓ పండగకు హాజరైన సందర్భంగా  నోట్లరద్దును ఓ ప్లాప్ షోగా అభివర్ణించారు. ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. పెద్దనోట్లరద్దు - నగదు కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశ ప్రజలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాపాడాలని కోరారు.  దేశాధినేతగా రాష్ట్రపతి స్పందించి ప్రజలను కాపాడాలని మమత అభ్యర్థించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/