Begin typing your search above and press return to search.

కృష్ణమ్మ ఒడిలో ఏమేం పెట్టాలి?

By:  Tupaki Desk   |   30 July 2015 6:12 PM GMT
కృష్ణమ్మ ఒడిలో ఏమేం పెట్టాలి?
X
కృష్ణా నదికి ఇరువైపులా తీరంలో వేటిని వేటిని ఏర్పాటు చేయాలి? ఎక్కడ ఏమేం ఏర్పాటు చేస్తే బాగుంటుంది? తదితర వివరాలతో కూడిన సర్వేను ఏపీ సర్కారు మొదలు పెట్టింది. ఈ సర్వే బాధ్యతను ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ ఇప్పటికే పనులు కూడా మొదలు పెట్టింది. విజయవాడ నుంచి అమరావతి వరకు దాదాపు 45 కిలోమీటర్ల మేర ఈ సర్వే జరగనుంది. అమరావతితోపాటు దాని తర్వాత మరొక ఐదు కిలోమీటర్ల వరకు ఈ సర్వే జరగనుంది.

కృష్ణా నది తీర ప్రాంతాన్ని రివర్ ఫ్రంట్ గా తీర్చిదిద్దాలని చంద్రబాబు భావిస్తున్న విషయం తెలిసిందే. రాజధాని నిర్మాణంలో భాగంగా నదీ అభిముఖ నిర్మాణాలు, వంతెనలు, పర్యాటక ప్రాంతాలు, రహదారులను ఏర్పాటు చేయనున్నారు. నది మధ్యలో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇవన్నీ పూర్తి కావాలంటే వాటికి ముందు నదికి సంబంధించిన పూర్తి వివరాలు అవసరం. అందుకే నదికి సంబంధించిన సమస్త సమాచారాన్ని సేకరించి క్రోడీకరించాలని నిర్ణయించారు.

రాజధాని రక్షణకు, ప్రగతికి నిర్దేశించిన ఫ్లడ్ బ్యాంకు నిర్మాణంలోనూ సర్వే నివేదిక కీలక పాత్ర పోషించనుంది. ఏయే ప్రాంతాలు నది లోతు ఎంత? వెడల్పు ఎంత? ప్రవాహ వేగం ఎంత? వరదల సమయంలో ఎంత నీరు ప్రవహిస్తుంది తదితర వివరాలు సేకరిస్తారు వాటి ఆధారంగానే రాజధానితోపాటు ఇతర నిర్మాణాల ప్రణాళికలను రూపొందించనున్నారు.