Begin typing your search above and press return to search.

రైజింగ్ క‌శ్మీర్ ఎడిట‌ర్ దారుణ‌హ‌త్య‌

By:  Tupaki Desk   |   15 Jun 2018 5:49 AM GMT
రైజింగ్ క‌శ్మీర్ ఎడిట‌ర్ దారుణ‌హ‌త్య‌
X
క‌శ్మీరులో దారుణం చోటు చేసుకుంది. క‌శ్మీరు లోయ‌లో శాంతిచ‌ర్చ‌ల్లో కీల‌క‌భూమిక పోషిస్తున్న సీనియ‌ర్ పాత్రికేయుడు.. రైజింగ్ క‌శ్మీర్ ప‌త్రిక సంపాద‌కుడు షుజాత్ బుఖారీ ఉగ్ర‌వాదుల తూటాల‌కు ప్రాణాలు విడిచారు. ప‌క్కా ప్లాన్ తో ఆయ‌న్ను మ‌ర్డ‌ర్ చేశారు. శ్రీ‌న‌గ‌ర్ ప్రెస్ కాల‌నీలో ఆయ‌న త‌న ఆఫీసు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చినంత‌నే మిలిటెంట్లు ఆయ‌న‌పై అతి స‌మీపం నుంచి కాల్పులు జ‌రిపారు.

గురువారం సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు ఆఫీసు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ వెంట‌నే బుఖారి త‌ల‌లో నుంచి.. పొత్తి క‌డుపులో నుంచి బుల్లెట్ల వ‌ర్షం కురిపించ‌టంతో ఆయ‌న అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలారు. ఘ‌ట‌నాస్థ‌లంలోనే మ‌ర‌ణించారు.

తాజా ఉదంతంతో పాత్రికేయ ప్ర‌పంచం షాక్ తింది. ఎడిట‌ర్ పై కాల్పులు జ‌రిపిన మిలిటెంట్ల‌పై అక్క‌డి సెక్యురిటీ సిబ్బంది కాల్పులు జ‌రిపారు. అయినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. బుఖారీ హ‌త్య‌ను అన్ని వ‌ర్గాల వారు ముక్త కంఠంతో ఖండించారు. దేశ వ్యాప్తంగా పాత్రికేయుల విధి నిర్వ‌హ‌ణ పెను స‌వాలుగా మారింద‌ని.. ముఖ్యంగా క‌శ్మీర్ లాంటి ప్రాంతంలో అయితే ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంద‌ని ఎడిట‌ర్స్ గిల్ట్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

శ్రీ‌న‌గ‌ర్ కు చెందిన బుఖారీపైన గ‌తంలోనూ ఇదే త‌ర‌హాలో హ‌త్యాయ‌త్నాలు జ‌రిగాయి. ఇప్ప‌టికి మూడుసార్లు ఆయ‌న ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నా.. నాలుగో ప్ర‌య‌త్నాన్ని ఆయ‌న నిలువ‌రించ‌లేక‌పోయారు. హిందూ ప‌త్రిక‌కు శ్రీ‌న‌గ‌ర్ బ్యూరో చీఫ్ గా ప‌ని చేసిన బుఖారీ త‌ర‌వాతి కాలంలో రైజింగ్ క‌శ్మీర్ ప‌త్రిక‌కు ఎడిట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. భ‌యం అన్న‌ది ఎరుగ‌ని వ్య‌క్తిగా బుఖారీకి పేరుంది.

క‌శ్మీర్ మీడియాలో ప‌లువురు ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టుల‌కు ఆయ‌న్ను గురువుగా భావిస్తుంటారు. నిత్యం క‌శ్మీరీ ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం త‌పించే ఆయ‌న‌.. చివ‌రి క్ష‌ణాల్లోనూ క‌శ్మీరులో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న పేరుతో ఐక్య‌రాజ్య‌స‌మితి విడుద‌ల చేసిన నివేదిక‌ను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేయ‌టం గ‌మ‌నార్హం. బుఖారీపై ఢిల్లీ మీడియా ప్ర‌తినిధుల వాద‌న భిన్నంగా ఉంటుంది. ఆయ‌న్ను ఉగ్ర‌వాదుల ప‌క్ష‌పాతిగా చిత్రీక‌రిస్తుంటార‌న్న విమ‌ర్శ ఉంది. అయితే.. వాస్త‌వంగా ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని క్షేత్ర‌స్థాయిలో అందిస్తాన‌న్న మాట ఆయ‌న చెబుతుంటారు. బుఖారీ హ‌త్య‌ను జ‌మ్ముక‌శ్మీర్ ప్ర‌భుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి హ‌త్య‌పై దిగ్భాంత్రి వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు త‌న సంతాప సందేశాన్ని పంపారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మొహ‌బూబా ముఫ్తీ భావోద్వేగానికి గుర‌య్యారు. కొద్ది రోజుల క్రిత‌మే ఆయ‌న త‌న‌ను క‌ల‌వటానికి వ‌చ్చారంటూ గుర్తు చేసుకొని బాధ ప‌డ్డారు. ఉగ్ర‌వాదుల పిరికిపంద‌ల చ‌ర్య‌గా ఆమె అభివ‌ర్ణించారు.