రేవంత్ లాజిక్... ఎన్నికల కమిషన్ కు బీపీ

Sun Dec 09 2018 22:25:43 GMT+0530 (IST)

కొన్ని విషయాలు.... జనం చేస్తే సాధారణం విషయాలుగా చూస్తారు. అదే ప్రముఖులు చేస్తే తీవ్రమైన నేరాలైపోతాయి అవి. ఉదాహరణ ఒక సామాన్యుడు రోడ్డు పక్కన పాస్ పోయడం వార్త కాదు. అదే ఒక ఎంపీ అదే పని చేస్తే అది జాతీయ వార్త అయ్యి కూర్చుంది. అనేక మంది పౌరులకు రెండు చోట్ల ఓటు ఉండటం చూస్తూనే ఉంటాం. దానిని పెద్దగా పట్టించుకోం. అది నేరమే కానీ... ఎవరికీ పట్టదు. అదే ఒక ముఖ్యమంత్రి ఆ పనిచేస్తే అది పెద్ద చిక్కే.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  ఇపుడు అలాంటి చిక్కునే ఎదుర్కొన్నారు. ఆయనకు తాను పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి గ్రామంలో ఓటు ఉంటుంది. అక్కడ చంద్రశేఖర రావు సన్ ఆఫ్ రాఘవ రావు అనే పేరు మీద ఓటుంది. దాంతో పాటు తన అల్లుడు హరీష్ రావు నియోజకవర్గం అయిన చింతమడక (ఇది కేసీఆర్ స్వగ్రామం)లో మరో ఓటు ఉందట. ఈ విషయానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆధారాలు సంపాదించారు.

*టీఆర్ ఎస్ అధినేత - ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని - ఇది పెద్ద నేరమని - ఇంటి పేరును ముందు వెనుకాల మార్చి రెండు చోట్ల ఓట్లు పొందారు* అని  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇలా ఒకే వ్యక్తి రెండు ఓట్లు నమోదు చేసుకోవడం చట్టరీత్యా నేరమని దీనిపై ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ రెండు ఓట్లపై రాష్ట్ర ఎన్నికల అధికారి వెంటనే స్పందించకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఒకవైపేమో లక్షల ఓట్లు తొలగించి సింపుల్‌గా సారీ చెప్పిన ఎన్నికల సంఘం ఇలా ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటే చోద్యం చూస్తుందా అని రేవంత్ ప్రశ్నించారు. ఇన్ వాలిడ్ ఓట్లు తీసేసి అర్హులకు ఓటు హక్కు కల్పించాల్సిన ఎన్నికల సంఘం ఎవరికి ఊడిగడం చేస్తోందని రేవంత్ తీవ్రంగా ప్రశ్నించారు.