కోదండతో రేవంత్ భేటీ..కొత్త చర్చకు శ్రీకారం

Wed Feb 14 2018 23:17:30 GMT+0530 (IST)

తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ క్రమంలో రాజకీయంగా తనతో కలిసి వచ్చే శక్తులతో ముందుకు సాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను ఎదుర్కునేందుకు కలిసి వచ్చే శక్తులను కలుపుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ సన్నిహితుడు కొప్పుల రాజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మందకృష్ణతో భేటీ అయ్యారు. ఈ సమావేశం ఆసక్తి సృష్టించగా....తాజాగా తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి కలిశారు.తార్నాకలోని కోదండరాం నివాసానికి వెళ్లి మళ్లీ రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. అయితే ఈ సందర్భంగా తన నివాసంలో జరిగే శుభకార్యానికి రావాల్సిందిగా కోదండరాంను రేవంత్ ఆహ్వానించినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై కూడా వీరి మధ్య చర్చ జరిగినట్లుగా సమాచారం.  తమ భేటీకి సంబంధించిన విషయాన్ని రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా తెలిపారు. కోదండరాంతో మర్యాదపూర్వకంగా మాత్రమే భేటీ అయ్యానని ఆయన వివరించారు.

కాగా త్వరలోనే కోదండరాం ఓ రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య భేటీ అమిత ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ పార్టీ ఏర్పాటుపై రేవంత్ అభిప్రాయాలను కోదండరాం అడిగి తెలుసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ ఏర్పాటు మొదలుకొని అనంతరం ముందుకు తీసుకుపోవాల్సిన కార్యాచరణపై వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.