Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రేవంత్..ఎంత ఉద్వేగమో చూశారా?

By:  Tupaki Desk   |   17 Sep 2019 4:22 PM GMT
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రేవంత్..ఎంత ఉద్వేగమో చూశారా?
X
నిజమే... మరి తన రాజకీయ జీవితానికే శ్రీకారం చుట్టిన తెలుగు దేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోకి పార్టీ మారిన రేవంత్ రెడ్డి అడుగుపెడితే పరిఃస్థితి ఎంత ఉద్వేగంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. అందులోనూ పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు పార్టీ కేడర్ కు తానున్నానంటూ అండగా నిలిచిన నేత... పార్టీ వీడిన చాలా కాలానికి మళ్లీ కార్యాలయానికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పాల్సిన పని లేదు. టీడీపీలో ఉన్నంత కాలం ఫైర్ బ్రాండ్ నేతగా, ప్రత్యర్థులపై విరుచుకుపడే రేవంత్ కు టీడీపీలో చాలా మంది అభిమానులు ఉన్నారు. వారందరి ఆశలను వమ్ము చేస్తూ పార్టీ మారిన రేవంత్... తప్పని పరిస్థితుల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వస్తే.. తమ ఆరాధ్య నేతను తమ పార్టీ కార్యాలయంలో చూసిన టీడీపీ కేడర్ నిజంగానే పండుగ చేసుకుని ఉంటుంది. పార్టీ మారినా... తమ వద్దకు వచ్చిన రేవంత్ కు టీడీపీ కేడర్ ఘన స్వాగతం పలకడమే కాకుండా గుండెలకు హత్తుకున్నంత పని చేసింది. ఈ సన్నివేశం నిజంగానే తెలుగు రాష్ట్రాల్లో మరిచిపోలేని, ఓ అరుదైన సన్నివేశమేనని చెప్పక తప్పదు.

రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగిన రేవంత్... తెలంగాణలో పార్టీ బ్రతికే ఛాన్స్ లేదన్న భావనకు వచ్చి పార్టీకి చేయిచ్చేశారు. టీడీపీకి గుడ్ బై కొట్టేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. టీడీపీలో ఉన్నంత కాలం విన్నర్ గానే కొనసాగిన రేవంత్... కాంగ్రెస్ పార్టీలో చేరగానే ఓటమిపాలయ్యారు. అయితే ఆ ఓటమిని దిగమింగుచుకుని మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేసి ఘన విజయం సాధించారు. మొత్తంగా టీడీపీని వీడిన తర్వాత రేవంత్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు దూరమయ్యారనే చెప్పాలి. అలాంటిది ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఏపీ అసెంబ్లీ తాజా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న తర్వాత... ఆయన పార్థీవదేహాన్ని చూసేందకు రేవంత్ మంగళవారం మధ్యాహ్నం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చారు. కాంగ్రెస్ ఎంపీగానే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అడుగుపెట్టిన తనకు టీడీపీ కేడర్ చూపించిన ఆప్యాయతతో రేవంత్ ఉబ్బితబ్బియ్యారంటే అతిశయోక్తి కాదేమో.

కోడెల పార్థీవ దేహాన్ని చూసేందుకే అయినా.. పార్టీ మారిన తనకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఎలాంటి అనుభవం ఎదురవుతుందోనన్న బెంగ ఓ వైపు ఉన్నా కూడా రేవంత్ పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. అయితే రేవంత్ ఊహకు అందనంతగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన అడుగుపెట్టగానే.. టీడీపీ కేడర్ అంతా ఆయనను ‘అన్నా’ అంటూ చేతులు పట్టేసుకున్నారు. ‘అన్నా ఎలా ఉన్నారు’ అంటూ ఆత్మీయంగా పలకరించారు. అలా ఒకరిద్దరు కాదు.. కోడెల భౌతిక కాయాన్ని చూసేందుకు వచ్చిన మొత్తం టీడీపీ కార్యకర్తలందరూ రేవంత్ ను చుట్టేసుకున్నారు. పార్టీ మారినా తనను టీడీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు తను ఊహించని రీతిలో చేతులు పట్టేసుకుని మాట్లాడటంతో రేవంత్ కూడా ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ దృశ్యాలను టీవీల్లో చూసిన వారు కూడా అంతే ఉద్వేగానికి గురయ్యారని చెప్పక తప్పదు. మొత్తంగా ఉద్వేగం కట్టలు తెంచుకుంటే ఎలా ఉంటుందో... ట్రస్ట్ భవన్ లో రేవంత్ అడుగుపెట్టిన సందర్భం కళ్లకు కట్టిందని చెప్పక తప్పదు.