Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ద‌క్షిణాది ఆవేద‌న క‌రెక్ట్ అంటున్న రేవంత్‌

By:  Tupaki Desk   |   23 May 2017 9:50 AM GMT
ప‌వ‌న్ ద‌క్షిణాది ఆవేద‌న క‌రెక్ట్ అంటున్న రేవంత్‌
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. దక్షిణ భారతానికి అన్యాయం జరుగుతోందని ఇటీవ‌ల ప‌దే ప‌దే గ‌ళం విప్పుతున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు రేవంత్ రెడ్డి మద్ద‌తిచ్చారు. తెలుగుదేశం పార్టీ మినీ మ‌హానాడులో పాల్గొన్న రేవంత్ ఉత్త‌రాది-ద‌క్షిణాది విబేధాలు ప‌లు అంశాల్లో క‌నిపిస్తున్నాయ‌ని అన్నారు. ద‌క్షిణ భార‌త‌దేశానికి అన్యాయం జ‌రుగుతోంద‌ని చెప్తున్న‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఆవేదన సరైనదేనని రేవంత్‌ సమర్థించారు. ఇటీవ‌ల టీటీడీ ఈఓ నియామ‌కం విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన‌ ఉత్త‌రాది-ద‌క్షిణాది వ్యాఖ్య‌లు తెలుగుదేశం పార్టీని ఇర‌కాటంలో ప‌డేసిన సంగ‌తి తెలిసిందే. అయితే స‌రిగ్గా అదే వ్యాఖ్య‌ల‌ను రేవంత్ స‌మ‌ర్థించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ సంద‌ర్భంగా రేవంత్ మ‌రిన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో ఇప్ప‌టివ‌ర‌కు బీజేపీతో తాము పొత్తులోనే ఉన్న‌ట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే... బీజేపీ వద్దనుకుంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని ఆయ‌న తేల్చిచెప్పారు. ఎన్నికల్లో పార్టీల మధ్య పొత్తు సహజ ప్రక్రియ అని రేవంత్ రెడ్డి విశ్లేషించారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీలు విడిపోయాయని రేవంత్ చెప్పారు. ఈ క్ర‌మంలో కేసీఆర్‌ కు వ్యతిరేకంగా పోరాడే ఏ పార్టీతోనైనా తాము పొత్తుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. ఎవ‌రు క‌లిసివ‌చ్చినా, రాకున్నా....కేసీఆర్ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై త‌మ పోరాటం కొన‌సాగుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ప్రణాళికే లక్ష్యంగా మహానాడు నిర్వహిస్తున్నామని రేవంత్‌రెడ్డి అన్నారు. స‌క్ర‌మ‌మైన ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగితే టీఆర్ ఎస్‌ కు ధీటైన ప్ర‌త్యర్థిగా టీడీపీ నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని తెలిపారు.