తుమ్మల - హరీశ్ కు బెర్త్ లేదు..రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Mon Feb 18 2019 16:42:01 GMT+0530 (IST)

కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత - ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. అయితే ఈ దఫా మీడియాతో మాట్లాడటం కాకుండా చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సంచలనం సృష్టించే వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కేబినెట్ విస్తరణ గురించి రేవంత్ సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుత మంత్రివర్గ విస్తరణలో హరీష్ రావుకు మంత్రి పదవిరాదని రేవంత్ రెడ్డి ప్రకటించారు! మిడ్ మానేరు - గౌరెల్లి - తోటపల్లి పనుల్లో సుమారు వెయ్యి కోట్లు హరీష్ రావు తీసుకున్నారని - తన బినామీలకే కాంట్రాక్టులు ఇప్పించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ డబ్బులనే కేసీఆర్ కి  తెలియకుండా హరీష్ ఎన్నికల్లో పంచారని రేవంత్ చెప్పారు.హరీష్ రావు గత అసెంబ్లీ ఎన్నికల్లో 30మందికి డబ్బులిచ్చారు. కొందరు కాంగ్రెస్ వాళ్లకు ఇస్తానంటే తీసుకోలేదు అని రేవంత్ వెల్లడించారు. ``బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో హరీష్ రావు పోన్ లో మాట్లాడారు ..ఇది కేసీఆర్ కు తెలిసింది. అందుకే ఆయనకు మంత్రి పదవి లేదు. హరీష్ రావు ఎదురుతిరిగితే...పాస్ పోర్ట్ కేసులో పెట్టేందుకు కేసీఆర్ రెడీ గా ఉన్నారు.`` అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ``హరీష్ రావుతో పాటు మరో నలుగురు సీనియర్లకు మంత్రి పదవి లేదు. కేటీఆర్ ను...రాము అని పిలిచినందుకే తుమ్మలకు మంత్రి పదవి లేదు. నాయిని నర్సింహారెడ్డిని సైతం కేసీఆర్ పక్కన పెట్టేశాడు. కడియం శ్రీహరి నిజాయితీ పరుడు. ఆయనపై ఒక్క అవినీతి ఆరోపణ లేదు. అయినా కడియంకు మంత్రి పదవి ఇవ్వడంలేదు. ఈటల రాజేందర్ పై నేను గతంలో చేసిన అవినీతి ఆరోపణలకు కట్టుబడి ఉన్న`` అని రేవంత్ ప్రకటించారు.

ఎన్నికల్లో యాభై లక్షలు దొరికిన పట్నం నరేందర్ రెడ్డి కేసు ఎందుకు ఈడీ ఇవ్వరని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ``ఐటీ శాఖ వివరాలు ఇస్తే కూడా ఎందుకు ఈడీ విచారించదు? నాపై మాత్రం ఐటీ - ఈడీ కేసులు పెట్టించారు. ఈడీ కేసుల్లో నన్ను - వేం నరేందర్ రెడ్డిని పెట్టుకోండి. నరేందర్ రెడ్ది కొడుకులను పిలిచి విచారించడం ఏంటి? కేటీఆర్ కొడుకుపై కామెంట్లు చేస్తే బాధ అయింది. మరి మా పిల్లలను విచారిస్తే మేము ఊరుకోవాలా` అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతిలో కేసీఆర్ - కేటీఆర్ లకు వాటాలున్నాయని రేవంత్ రెడ్డి ప్రకటించారు.యాభై మంది జవాన్లకు కేసీఆర్ నివాళులు అర్పించకపోవడం దారుణమని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ దృష్టిలో జవాన్ - కిసాన్ లకు విలువలేదన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి చనిపోతే పలకరించిన కేసీఆర్ అదే నిజామాబాద్ జిల్లాలో ఆందోళన చేస్తున్న రైతులను పట్టించుకోలేదన్నారు. లోక్ సభకు ఎన్నికలు వాయిదా కూడా పడొచ్చని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. తాను ఎక్కడున్నా కంఫర్ట్ గానే ఉంటానని రేవంత్ రెడ్డి ప్రకటించారు.