Begin typing your search above and press return to search.

పొత్తుల‌పై బాబుకే క్లాస్ తీసుకున్న రేవంత్‌

By:  Tupaki Desk   |   13 Oct 2017 4:42 AM GMT
పొత్తుల‌పై బాబుకే క్లాస్ తీసుకున్న రేవంత్‌
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో పొత్తుల క‌ల‌క‌లం ఇంకా కొన‌సాగుతోంది. టీఆర్ ఎస్ పార్టీకి వ్య‌తిరేకంగా - ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిపాల‌న‌లోని లోపాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు విప‌క్షాల‌న్నీ ఏకం కావాల‌ని తెలంగాణ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో పొత్తుల‌కు తెలుగుదేశంలోని కొంద‌రు నేత‌లు ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తుండగా... పార్టీ నేత‌ల్లో మ‌రికొంద‌రు ఎందుకీ తొంద‌ర అంటూ బ్రేకులు వేస్తున్నారు. ఈ వివాదం ఇంకాస్త ముదిరి పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు దృష్టికి వెళ్ల‌డం..పొత్తుల విష‌యంలో ఇప్పుడు చ‌ర్చించాల్సిన అవ‌స‌రం లేదంటూ ఎన్నిక‌లకు ఇంకా చాలా స‌మ‌యం ఉందంటూ క్లాస్ తీసుకున్నారు. పార్టీ స‌మావేశంలో ఈ మేర‌కు తెలుగు త‌మ్ముళ్ల‌కు స్ప‌ష్ట‌మైన హెచ్చ‌రిక‌లు జారీచేశారు. ఈ క్లాస్ ప‌రోక్షంగా తెలంగాణ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అని టాక్ వినిపించింది.

అయితే ఇలా పార్టీ ర‌థ‌సార‌థి చెప్పిన‌ప్ప‌టికీ రేవంత్ రెడ్డి త‌న రూటు మార్చుకోలేద‌ని తాజాగా ఆయ‌న చేసిన కామెంట్ల‌తో రుజువు అయింద‌ని అంటున్నారు. ఎన్టీఆర్ భవన్‌ లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ అధ్య‌క్ష‌తన జ‌రిగిన స‌మావేశంలో సంస్థాగత ఎన్నికల నిర్వహణ-ప్రస్తుత రాజకీయాల పరిస్థితులపై సమీక్ష - భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపై పార్టీ నేత‌లు చర్చించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప‌రోక్షంగా చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. పొత్తులపై ఎక్కడా ఎగబడడం లేదని వివ‌రించారు. ``మిత్రపక్షాలను కలుపుకునిపోవడం 1982 నుంచి తెలుగుదేశం పార్టీకి ఉంది. కేంద్రంలో కాంగ్రెస్సేతర పార్టీల పాలనకు ఎన్టీఆర్ పునాది వేశారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ వేసిన పునాది వల్లనే ఈ రోజు బీజేపీ పార్టీ 282 సీట్లను గెలిచి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. గులాబీ చీడను తొలగించే బాధ్యత ప్రతి పసుపు కార్యకర్తపై ఉంది. ఈరోజు జరుగుతున్న పరిణామాలను సమీక్షించుకుని భవిష్యత్ కార్యాచరణ చూసుకోవాలి``అని రేవంత్ రెడ్డి వివ‌రించారు.

రాష్ట్రంలో ఎన్ని గ్రామ పంచాయితీలు ఉన్నాయో, ఎంత మంది జనాభా ఉన్నారో తెలియని పరిస్థితుల్లో గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా రాష్ట్రపాలన సాగుతోంద‌ని రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. కేసీఆర్ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. టీటీడీపీ నేతల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తెరాసను తిరస్కరిస్తున్నారన్నారు. ప్రతిపక్షాల అనైక్యతే తెరాసకు బలంగా మారుతోందన్నారు. కాగా, పార్టీ శ్రేణుల‌కు ఉత్సాహం క‌లిగించే క్ర‌మంలోనే పార్టీ ర‌థ‌సార‌థిని టార్గెట్ చేసిన‌ట్లు కామెంట్ చేయ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉందంటున్నారు.