Begin typing your search above and press return to search.

డ్రగ్స్ ప‌బ్ దందాలో కేటీఆర్ బామ్మ‌ర్ది

By:  Tupaki Desk   |   23 July 2017 5:18 PM GMT
డ్రగ్స్ ప‌బ్ దందాలో కేటీఆర్ బామ్మ‌ర్ది
X
తెలంగాణ‌లో క‌ల‌క‌లం రేకెత్తిస్తోన్న డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం రాష్ట్ర ప్ర‌భుత్వం మెడ‌కు చుట్టుకుంటున్న‌ట్లు కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ ల‌క్ష్యంగా ఇప్ప‌టికే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏకంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దిగ్విజ‌య్ సింగ్ ప్ర‌భుత్వంలోని పెద్ద‌ల‌కు డ్ర‌గ్స్ మాఫియాతో లింకులు ఉన్న‌ట్లు ఆరోపించారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం విమ‌ర్శ‌ల జాబితాలోకి తాజాగా మ‌రో ప‌క్ష‌మైన టీడీపీ సైతం చేరింది. డ్రగ్స్ దందాపై తెలంగాణ టీడీపీ కార్యానిర్వాహక అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు మంత్రి కేటీఆర్ బావ‌మ‌రిది డ్రగ్స్ దందాతో సంబంధాలు ఉన్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు.

హైద‌రాబాద్‌లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ కేసు తెర‌మీద‌కు తేవ‌డం అక్ర‌మాల‌కు వెలికితీసేందుకు కాద‌ని అన్నారు. మియపూర్ భూములు అన్యాక్రాంతం విషయాన్ని పక్కన పెట్టేందుకు డ్రగ్స్ ను బయటకు తెచ్చారని ఆయ‌న ఆరోపించారు. డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ పేరుతో చిన్నా, చితకా వారిని తెచ్చి విచారణ చేస్తున్నారని అయితే పెద్ద వారిని వదిలేస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. పెద్ద వాళ్ళు ఉన్నట్లు తెలిసినప్ప‌టికీ వారికి ఎందుకు నోటీసులు ఇవ్వడం లేద‌ని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. ప్రభుత్వ పెద్దలు శవాల మీద పేలాలు ఏరుకునే వారిలా తయారయ్యర‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్‌ బంధువులు, మిత్రుల, మంత్రుల బంధువుల పబ్స్ కు నోటీసులు ఇవ్వరని ఆయ‌న ప్ర‌శ్నించారు. కేటీఆర్ బావమరిది పబ్‌కు ఎందుకు నోటీస్ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి నిల‌దీశారు. హైద‌రాబాద్‌లోని ఐ లైఫ్, టానిక్ పబ్ లు టీఆర్ఎస్ నేతలకు చెందిన‌వ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. తాను గతంలోనే పలు పబ్ ల వ్యవహారం పై పోలీస్ లకు ఫిర్యాదు చేశాన‌ని అప్పుడు మాత్రం చ‌ర్య‌లు తీసుకోలేద‌ని, ఇప్పుడు మాత్రం హ‌డావుడి చేస్తున్నార‌ని రేవంత్ రెడ్డి తెలిపారు.

డ్ర‌గ్స్ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి లేద‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ - నార్కోటిక్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థ లకు ప్రభుత్వం ఎందుకు లేఖలు రాయడం లేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. డ్రగ్స్ పేరుతో యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేసుకోవడానికే కేసులను వారి వద్దే పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర దర్యాప్తు సంస్థలకు డ్రగ్స్ కేసును అప్పగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.