Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు ట్వీట్ పంచ్ విసిరిన రేవంత్‌

By:  Tupaki Desk   |   16 Aug 2018 5:07 AM GMT
కేసీఆర్ కు ట్వీట్ పంచ్ విసిరిన రేవంత్‌
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పైనా.. ఆయ‌న కుమారుడు కేటీఆర్ తీరుపైనా ఒంటి కాలి మీద లేచే తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ట్వీట్ పంచ్ విసిరారు. వార‌స‌త్వ రాజ‌కీయాల పేరుతో త‌మ‌పై కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ చేసిన విమ‌ర్శ‌ల‌పై కేసీఆర్‌.. కేటీఆర్ లు తీవ్రంగా త‌ప్పు ప‌ట్ట‌టం తెలిసిందే.

త‌మ స‌ర్కారుపై రాహుల్ చేసిన విమ‌ర్శ‌ల్ని తండ్రీ కొడుకులు ఇద్ద‌రూ వంతుల వారీగా విమ‌ర్శించారు. రాహుల్ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన వారిపైన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి విరుచుకుప‌డ్డారు. రాహుల్ ను త‌ప్పు ప‌డుతున్న కేసీఆర్... నాడు వారి కుటుంబ‌మంతా సోనియా కాళ్లపైన ప‌డిన‌ప్పుడు తెలీదా? అంటూ ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా వ్యంగ్య వ్యాఖ్య‌లు చేశారు రేవంత్‌.

మీరు మ‌రీనూ రావు గారూ.. కుటుంబం మొత్తం కాళ్ల పైన ప‌డిన‌ప్పుడు తెలీదా? అంటూ పంచ్ విసిరిన ఆయ‌న‌.. ఏపీ విభ‌జ‌న అనంత‌రం త‌న కుటుంబ స‌భ్యులు మొత్తం క‌లిసి సోనియా నివాసానికి వెళ్లి క‌లిసిన‌ప్ప‌టి ఫోటోను త‌న ట్వీట్ పంచ్ కు జ‌త చేశారు రేవంత్‌. ఇప్పుడంటే రాహుల్ మీదా.. కాంగ్రెస్ పార్టీ మీదా విరుచుకుప‌డుతున్నారు కానీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణ‌యం తీసుకున్న వేళ‌.. ఆ పార్టీని ఎంత‌లా పొగిడార‌న్న విష‌యాన్ని తను పోస్టు చేసిన ఫోటోతో గుర్తు చేశారు రేవంత్‌.