Begin typing your search above and press return to search.

రేవంత్ ప్ర‌శ్న‌ల‌కు టీటీడీపీ స్పంద‌న ఏంటో?

By:  Tupaki Desk   |   19 Oct 2017 12:30 AM GMT
రేవంత్ ప్ర‌శ్న‌ల‌కు టీటీడీపీ స్పంద‌న ఏంటో?
X
స‌ల‌స‌ల కాగుతున్న అగ్నిప‌ర్వతం ఒక్కసారిగా బ‌ద్ద‌లై.... అందులోంచి లావా ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు వ‌స్తే...ఎంత గ‌గుర్పాటు క‌లిగిస్తుందో... అగ్నిప‌ర్వ‌తాల స‌మీపంలో ఉన్న‌వారికి అనుభ‌వం. ఈ పోలిక ఇప్పుడు ఎందుకు అంటే...తెలంగాణ టీడీపీ నేత‌(ఇంకా ఆయ‌న పార్టీ మార‌లేదు కాబ‌ట్టి...ఆఖ‌రికి ఆయ‌న్ను సస్పెండ్ కూడా చేయ‌లేదు కాబ‌ట్టి) - ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శైలిని గ‌మ‌నించిన వారు ఇప్పుడు ఇదే చెప్తున్నారు. తనను జైల్లో పెట్టిన కేసీఆర్ కు ఏపీ తెలుగుదేశం నాయకులు దండాలు పెడుతున్నారని తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీ యనమల రామకృష్ణుడికి తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారని రేవంత్ అన్నారు. ఏపీ నేతలు అన్నం పెట్టిన వారికే సున్నాలు పెడుతున్నారని దుయ్యబట్టారు. పరిటాల సునీత కుమారుడి వివాహానికి వెళ్లిన‌ కేసీఆర్ కు వంగివంగి దణ్ణాలు పెట్టారనీ - అదే చంద్రబాబు అక్కడకు వెళితే పట్టించుకునే వారే లేరని రేవంత్ రెడ్డి వాపోయారు. తెలంగాణలో ఏపీ నేతలకు పనేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ తో తెలంగాణలో గత కొద్ది కాలంగా కలిసి పని చేస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సింగరేణి ఎన్నికలు - ఇతర ఆందోళనల సమయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసిందని రేవంత్ అన్నారు. పొత్తులు పెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానంతో కలిస్తే తప్పేమిటని ప్రశ్నిస్తూనే తాను హస్తినలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయిన విషయాన్ని పరోక్షంగా అంగీకరించారు.

పార్టీకి వీర‌విధేయుడిగా(!) ఉండే రేవంత్ రెడ్డి ఈ రీతిలో భ‌గ్గుమ‌నడం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. తెలంగాణ‌లో టీడీపీకి పెద్ద దిక్కుగా...ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ - టీఆర్ ఎస్ పార్టీపై ఒంటికాలిపై లేచే నాయ‌కుడిగా రేవంత్‌ కు పేరుంది. చంద్ర‌బాబు సైతం ప్రాధాన్యం ఇచ్చారు. అయితే రేవంత్ ఈ స్థాయిలో విరుచుకుప‌డేందుకు కార‌ణం టీడీపీ - ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు అంటున్నారు. `డ్రీమ్ బిగ్‌` అనేది రేవంత్ కాన్సెప్ట్. అలాంటి ప్రాజెక్టుతోనే త‌న పార్టీ నేత‌ని ఎమ్మెల్సీగా గెలిపించేందుకు...పార్టీ ఆదేశానుసారమే...ఓటుకు నోటు స్కీం వేశారు. అయితే టైం బాగాలేక‌ రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిపోయారు. అయితే రేవంత్ దీనికి పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోలేదంటారు. కానీ ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు...ముఖ్యంగా పార్టీ అధినేత చంద్ర‌బాబు - ఏపీ నేత‌లు చేసిన ప‌నులు రేవంత్ దిమ్మ‌తిరిగిపోయేలా ఉన్నాయని...అవే రేవంత్ ఇంత‌గా క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌య్యేందుకు కార‌ణమంటున్నారు.

ఓటుకునోటు కేసు బ‌య‌ట‌కు వ‌చ్చాక గంభీర‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేసిన చంద్ర‌బాబు ఆ త‌ర్వాత త‌ట్టాబుట్టా స‌ర్దేసుకొని ఏపీకి చెక్కేశార‌నే భావ‌న రేవంత్‌ లో క‌లిగింద‌ట‌. తాను టీఆర్ ఎస్‌ పై పోరాటం చేస్తుంటే...చంద్ర‌బాబు మాత్రం స్నేహ‌హ‌స్తం చాటేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న హ‌ర్ట్ అయ్యార‌ట‌. దీనికి తోడుగా ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ మంత్రి ప‌రిటాల సునీత కుమారుడి వివాహం నాటి ఏపీ నేత‌ల ట్రీట్‌...రేవంత్‌ ను బాగా గాయ‌ప‌రిచింద‌ని అంటున్నారు. టీడీపీ ముఖ్య‌నేత‌లు - ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిన‌ప్ప‌టికీ...తాను ఒంటిరిపోరాటం చేస్తుంటే....ఒక‌వైపు పార్టీ అధినేత ప‌ట్టించుకోక‌పోవ‌డం...మ‌రోవైపు ఏపీ నేత‌ల శృతిమించిన దోస్తీతో రేవంత్ తీవ్రంగా హ‌ర్ట్ అయి కాంగ్రెస్ పార్టీలో చేరే నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు. అయితే ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన కామెంట్లు క‌ల‌క‌లం రేకెత్తిస్తున్నాయి. అన్నివేళ్లు సీఎం చంద్ర‌బాబు...ఏపీ టీడీపీ నేత‌ల వైపు చూపిస్తున్నాయి. దీనికి సైకిల్ పార్టీ నేత‌లు ఏం స‌మాధానం ఇస్తారో చూడాలి మ‌రి.

కొస‌మెరుపుః టీటీడీపీ ఎమ్మెల్యేల‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న పార్టీలో చేర్చుకుంటే రేవంత్ నిప్పులు చెరిగారు. రాజ‌కీయ వ్య‌భిచారం అని ఆరోపించారు. అయితే అదే ప‌ని చంద్ర‌బాబు చేసి వైసీపీ నాయ‌కుల‌కు కండువా క‌ప్పేసిన స‌మ‌యంలో..టీఆర్ ఎస్ నేత‌లు టార్గెట్ చేసిన తీరుతో...``ముందు మీ నాయ‌కుడు ఏం చేస్తున్నాడో చెప్పు`` అనే ప్ర‌శ్న‌ల‌తో రేవంత్‌ లో టీడీపీ పెద్ద‌ల‌పై మొట్ట‌మొద‌లు అసంతృప్తి ప్రారంభం అయింద‌ని అంటున్నారు.