Begin typing your search above and press return to search.

పాటలతో కేసీఆర్ పై సమరం..?

By:  Tupaki Desk   |   3 Aug 2015 5:09 AM GMT
పాటలతో కేసీఆర్ పై సమరం..?
X
రోజూ కాకుండా.. మూడు రోజులకో ప్రెస్ మీట్ పెట్టేసి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ.. అధికారపక్షాన్ని తన మాటలతో ఇరుకున పెట్టే తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇప్పుడేం చేస్తున్నారు? ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లి.. కండీషనల్ బెయిల్ మీద తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన రేవంత్.. ఈ మధ్యనే తన మీదున్న కండీషనల్ బెయిల్ రద్దు చేయాలని దరఖాస్తు చేయటం.. దాన్ని కొట్టేయటం తెలిసిందే.

హైదరాబాద్ మహానగరంలో రాజకీయాలు చేసే రేవంత్ లాంటి నేత.. కొడంగల్ లాంటి ప్రాంతంలో పెద్దగా పని లేకుండా ఏం చేస్తున్నారన్న డౌట్ చాలామందికే ఉంది. నిజానికి రేవంత్ ఖాళీగా ఏమీ లేరంట. ఆయన నిత్యం చాలా బిజీబిజీగా ఉంటున్నారట.

ముఖ్యమంత్రి కేసీఆర్ పై పాటలతో సమరం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాకు చెందిన ఒక పాటల రచయిత.. సింగర్ తో కలిసి అల్బం తయారీలో బిజీబిజీగా ఉన్నారట.

అప్పుడెప్పుడో రూపొందించిన తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా అనే పాట ఇప్పటికీ ఎంతగా ఊపేస్తుందో తెలిసిందే. ఆ స్థాయిలో ఉండే పాటను రూపొందించాలని ఆయన భావిస్తున్నారట.

మొత్తం ఐదు పాటలు ఉండే ఈ అల్బంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నిస్తారని చెబుతున్నారు. అందుకు తగ్గట్లే పాటల కాన్సెప్ట్ లు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీ ఎవరి కోసం? ఎందుకోసం? అన్న పాటతో పాటు.. తెలంగాణ ఆవిర్బావ దినోత్సవాల్ని ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు జరపలేదన్న సూటి ప్రశ్నతో ఒకపాట.. ఉద్యమానికి ఆయువు పట్టుగా నిలిచిన గద్దర్.. కోదండరాం.. విమలక్క.. గోరేటి వెంకన్న లాంటి వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ మరో పాట ఉంటుందని చెబుతున్నారు.

మొత్తం ఐదు పాటలు తెలంగాణ సమాజాన్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉండటంతోపాటు.. పార్టీకి మాంచి ఇమేజ్ తెచ్చేలా వస్తుందని చెబుతున్నారు. ఈ అల్బన్ రూపకల్పనను ప్రిస్టేజ్ గా తీసుకున్న రేవంత్.. అందుకోసం భారీగా కసరత్తు చేస్తున్నారట. ఈ పాటల సీడీని ధూంధాంగా విడుదల చేస్తారన్న మాట పార్టీలో వినిపిస్తోంది. మరి.. పాటలతో తాను అనుకున్న లక్ష్యాన్ని రేవంత్ ఏ మేరకు సాధిస్తారో చూడాలి.