Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో కనిపించుట లేదు.?

By:  Tupaki Desk   |   16 July 2018 11:16 AM GMT
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో కనిపించుట లేదు.?
X
ఎంత ఉధృతంగా ప్రవహించిన నది అయినా చివరకు సముద్రం లో కలవాల్సిందే.. ఆ సముద్రానికి అందరినీ తనలో కలిపేసుకొని ప్రశాంతంగా ఉండే నేర్పు ఉంది. కాంగ్రెస్ లాంటి మహాసముద్రంలోకి రాకముందు ఆయనో ఫైర్ బ్రాండ్.. కానీ ఇప్పుడు ఎక్కడా వెతికినా కనిపించడం లేదు.కాంగ్రెసోళ్లే సీఎం పోస్టు తమకంటే తమకు అంటూ ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. ఇక ఆయనకు చోటెక్కడిది అని భావించి సైలెంట్ అయిపోయినట్టున్నాడు. బయటకు వెళ్లలేక.. కాంగ్రెస్ లో ఉండలేక సతమతమవుతున్నారు.. ఆయనే రేవంత్ రెడ్డి.

ఓటు కు నోటులో చంద్రబాబును ఇరికించాక రేవంత్ రెడ్డి రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. కేసీఆర్ వ్యతిరేకులు ఆయను హీరోను చేశారు. కేసీఆర్ ను తిడుతూ రాజకీయంగా రేవంత్ దుమారం రేపారు. కానీ రోజురోజుకు తెలంగాణలో కుచించుకుపోయిన తెలుగుదేశం పార్టీ కాడి వదిలి కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ టీడీపీ నేతలు కేసీఆర్ తో సాన్నిహిత్యంగా ఉండడం కూడా రేవంత్ కు నచ్చక పార్టీ మారాడు.

కాంగ్రెస్ లో చేరినప్పుడు గ్రాండ్ వెలకం లభించింది. రాహుల్ గాంధీ షరామామూలుగానే కండువా వేశారు. రేవంత్ పుచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత వీరావేశంతో కాంగ్రెస్ సీఎంను తానేనని తన సన్నిహితుల ద్వారా వ్యాపింపచేశాడు.కాంగ్రెస్ ను లీడ్ చేస్తానని ఉత్సాహం చూపించారు. అక్కడే రేవంత్ కు చెక్ పడింది. ఉత్తమ్ - కోమటిరెడ్డి - జానారెడ్డి - డీకే అరుణ లాంటి సీనియర్లు తాము పార్టీ కోసం ఇన్నేళ్లు కష్టపడుతుంటే రేవంత్ సీఎం గా అవుతానని ఎలా ప్రచారం చేసుకుంటాడని ధ్వజమెత్తారు.

తాజాగా భువనగిరిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తే సీఎం అవుతాడని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇలా కాంగ్రెస్ సీనియర్ల ఆధిపత్యం మధ్య రేవంత్ ఒంటరి అయ్యాడు. కాంగ్రెస్ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు.. కేసీఆర్ ను కూడా తిట్టడం లేదు. ప్రస్తుతం ఏం చేస్తున్నాడు.? ఎక్కడున్నడన్నది సగటు కాంగ్రెస్ వాదిని వేధిస్తోంది.. ఇలా ఉవ్వెత్తున ఎగిసి.. కాంగ్రెస్ తీరాన్ని తాకిన రేవంత్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.