Begin typing your search above and press return to search.

రేవంత్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   9 Nov 2018 4:22 PM GMT
రేవంత్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నారా?
X
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారట.. శుక్రవారం ఈ వార్త తెలంగాణలో వైరల్‌గా మారింది. ఆన్‌ లైన్ - ఆఫ్‌ లైన్ లోనూ ఎక్కడ విన్నా ఇదే మాట. తన అనుచరులకు టిక్కెట్ ఇప్పించుకునే విషయంలో భీష్మించుకు కూర్చున్న రేవంత్.. వారందరికీ టిక్కెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఏకంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం భారీ ఎత్తున జరిగింది. అయితే, రేవంత్ మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించారు. తాను రెండు రోజులుగా ఇంట్లోనే ఉన్నానని.. అదంతా తప్పుడు ప్రచారమని చెప్పారు.

తన అనుచరుల్లో కొందరికి టిక్కెట్లు రాకపోవడంతో రేవంత్ రెడ్డి అలకబూనారని.. ఆయన పార్టీలో చేరినప్పడు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆవేదన చెందారని... కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడే తన అనుచరులకు టికెట్లు - కీలక పదవులు అనే ఒప్పందంతో పార్టీలో చేరారని ఇప్పుడది అమలు కాకపోవడంతో ఆయన నిరాశకు గురైనట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. తాను తప్పుకుంటానని బరిలో ఉండనని రేవంత్ అన్నారని ప్రచారం కావడంతో అంతా షాకయ్యారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీకే చెందిన కోమటి రెడ్డి బ్రదర్స్ కూడా తమ అనుచరుడు చిరుమర్తి లింగయ్యకు సీటు రాకపోతే తాము పోటి చేయమని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేవంత్ కూడా రాజీనామా చేస్తారని వార్తలు రావడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా కంగారు పడినట్లు సమాచారం. వరంగల్ వెస్ట్ (నరేందర్ రెడ్డి) - నిజామాబాద్ రూరల్ (అరికెల నర్సారెడ్డి) - ఆర్మూరు (రాజారామ్ యాదవ్) - ఎల్లారెడ్డి (సుభాష్ రెడ్డి) - దేవరకొండ (బిల్యా నాయక్) - ఇల్లందు (హరిప్రియ) - సూర్యాపేట (పటేల్ రమేష్ రెడ్డి) - చెన్నూరు (బోడ జనార్దన్) - సీతక్క (ములుగు)లకు రేవంత్ రెడ్డి సీట్లు అడుగుతున్నారు. కానీ.. వీరిలో కొందరికి టిక్కెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు నిరాకరించడంతో రేవంత్ ఆగ్రహించినట్లు చెబుతున్నారు.

అయితే రేవంత్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిచారు. తన పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారని... ఐటీ దాడుల సమయంలోనూ ఇలాగే తప్పుడు ప్రచారాలు చేశారని... తాను కాంగ్రెస్ నుంచే పోటి చేస్తానని ప్రకటించారు. తాను స్క్రీనింగ్ కమిటిలో కూడా ఎటువంటి అసంతృప్తిని వ్యక్తం చేయలేదన్నారు. కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానన్నారు.