Begin typing your search above and press return to search.

రేవంత్ ఈ సారి ఓడితే అంతే!

By:  Tupaki Desk   |   19 March 2019 6:57 AM GMT
రేవంత్ ఈ సారి ఓడితే అంతే!
X
హైదరాబాద్‌ నగరంలోని మల్కాజ్‌ గిరి పార్లమెంటు నుంచి కాంగ్రెస్‌ నుంచి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌ రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో ఆయనకు తోడుగా సీపీఐ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఈసారి అందరి దృష్టి మల్కాజ్‌ గిరిపై పడింది. గతేడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డి మహబూబ్‌ నగర్‌ జిల్లా కొడంగల్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.

పార్లమెంట్‌ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వమని రేవంత్‌ కోరారు.. మాల్కాజ్‌ గిరి లోని సీపీఐ నేతలందరూ రేవంత్‌ గెలుపు కోసం కృషి చేస్తారని ఆ పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. బీజేపీ హఠావో దేశ్‌ బచావో అని పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా లౌకిక శక్తులకు మద్దతిస్తున్నామని తెలిపారు. కాగా కేసీఆర్‌ అరాచకత్వంపై పోరాడటానికి సీపీఐ మద్దతు అడిగినట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు. మాల్కాజ్‌ గిరిలో ఆ పార్టీ ప్రభావం ఉంటుంది.

వారి మద్ధతుంటే తప్పకుండా గెలుస్తా అన్నారు. అరాచకత్వానికి మోదీ, కేసీఆర్‌ బొమ్మ– బొరుసుల్లాంటి వారు. బీజేపీ చేసిన పనులన్నింటికి కేసీఆర్‌ మద్ధతిచ్చి ఇప్పుడు ప్రజల ముందు నాటకాలు ఆడుతున్నారు. ఢిల్లీలో మోదీని, ఇక్కడ కేసీఆర్‌ ను నిలువరించాలంటే కమ్యూనిస్టుల సహకారం అవసరం అన్నారు. కేసీఆర్‌ కు వేసిన ప్రతీ ఓటు మోదీకి వేసినట్టే అన్నారు. సినిమాలో గచ్చిబౌలి దివాకర్‌ పాత్ర లాగా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ ఓ జోకర్‌ అని విమర్శించారు.

గెలుపు.. అంత సులువు కాదు..
తెలంగాణలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో లోక్‌ సభ ఎన్నికల్లో కూడా మరోసారి పరాభవం తప్పదని తెలుస్తోంది. అయితే సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఓడిపోయిన ఈసారి లోక్‌ సభ బరిలో మల్కాజ్‌ గిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే కేసీఆర్‌ ఉన్నంత వరకు రేవంత్‌ గెలుపు.. అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

2009లో కాంగ్రెస్‌ తరఫున సర్వే సత్యానారాయణ ఎంపీగా గెలిచారు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సీహెచ్‌ మల్లారెడ్డి విజయం సాధించారు. కాగా టీఆర్‌ ఎస్‌ రెండోస్థానంలో నిలువగా.. కాంగ్రెస్‌ మూడో స్థానంలో సరిపెట్టుకుంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో టీఆర్‌ ఎస్‌ తప్ప ఏ పార్టీ కూడా విజయం సాధించే పరిస్థితి కనిపించడం లేదని చెప్పవచ్చు. ఇటీవల ప్రకటించిన అన్ని సర్వేల్లో టీఆర్‌ ఎస్‌ పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు గ్రేటర్‌ హైదరాబాద్‌ లో కూడా టీఆర్‌ ఎస్‌ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

మల్కాజ్ గిరి సీటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు…
మేడ్చల్‌
మల్కాజ్‌ గిరి
కుత్బుల్లాపూర్‌
కూకట్‌ పల్లి
ఉప్పల్‌
ఎల్‌ బీ నగర్‌
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌