Begin typing your search above and press return to search.

దెబ్బకు రేవంత్ కు కేసీఆర్ గుర్తొచ్చాడే..

By:  Tupaki Desk   |   21 Feb 2019 6:19 AM GMT
దెబ్బకు రేవంత్ కు కేసీఆర్ గుర్తొచ్చాడే..
X
ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అని పోరాడిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం కొడంగల్ లో ఘోర ఓటమి చవి చూసి భారీ అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఆ షాక్ తో కోలుకోలేకపోయారు. ఆ తర్వాత సైలెన్స్ అయ్యారు. ఒక సంవత్సరం దాకా మీడియా, -ప్రజల ముందుకు రానని ఇంట్లోనే ఉండిపోయారు. విహారయాత్రలకు వెళ్లొచ్చారు.

తాజాగా రేవంత్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. కానీ ఈసారి రాజకీయంగా కాదు.. ‘ఓటుకు నోటు ’ కేసులో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈడీ తాజాగా ఆయన్ను విచారణకు పిలిచింది. ఆ దర్యాప్తులో భాగంగా రేవంత్ రెడ్డి బయటకు రావాల్సి వచ్చింది.

రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వివిధ సమీక్షలు - సమాలోచనలకు కూడా హాజరు కాలేదు. అయితే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ఏం చేశారన్న ప్రశ్న అందరిలోనూ ఆసక్తి రేపింది. మొన్నీ మధ్యే అసెంబ్లీలోని సీఎల్పీ రూములో కనిపించిన రేవంత్ రెడ్డి చేతికి మంత్రించిన వెండి బ్రెస్ లెట్ ఉండడం చూసి మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు. దీనికి గురించి రేవంత్ రెడ్డిని అక్కడి వారు అడిగినప్పుడు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

తన ఓటమికి కారణాలపై పండితుల నుంచి వివరాలు తెలుసుకున్నానని.. పండింట్ల నుంచి సలహాలు - సూచనలు తీసుకొని ఇటీవల తన ఇంట్లో సుదర్శన హోమాన్ని నిర్వహించినట్టు రేవంత్ చెప్పుకొచ్చాడు. ఈ హోమం సందర్భంగా మూడు రోజుల పాటు తాను ఇంటి నుంచి బయటకు రాకుండా నిష్టగా పూజలు చేశానని.. అలాగే తాను ఉంటున్న ఇంటికి వాస్తు నిపుణుల సిఫార్సుల మేరకు మార్పులు కూడా చేసినట్టు రేవంత్ చెప్పకొచ్చాడట.. అంతేకాదు.. తాను ఆధ్యాత్మిక బాటలో పయనిస్తున్నారని.. దైవకార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇదంతా ఓటమి - కేసులు చుట్టుముట్టడంతోనే పండితులతో కలిసి శాంతి పూజలు చేస్తున్నట్టు చెప్పారు.

రేవంత్ రెడ్డిలో వచ్చిన ఈ ఆధ్యాత్మిక మార్పుకు అంతా షాక్ అయ్యారట.. ఇదే రేవంత్ రెడ్డి మొన్నటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి యాగాలు, వాస్తు పట్టింపులపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు. కానీ అవే ఇప్పుడు కేసీఆర్ ను తెలంగాణలో గెలిపించి తిరుగులేని శక్తిగా మార్చాయి. దీంతో రేవంత్ కూడా ఆత్మావలోకనం చేసుకొని ఇప్పుడు పండితుల వద్దకు పరుగులు పెడుతున్నాడట.. తన దశను తిరిగి మార్చేందుకు కేసీఆర్ లా పూజలు, యాగాలు, వాస్తుమార్పులు చేయిస్తూ సెంటిమెంట్లను నమ్ముతున్నాడు. మరి కేసీఆర్ కు వరాలిచ్చిన దేవుడు కష్టాల్లో ఉన్న రేవంత్ కు ఇస్తాడా లేదా అన్నది వేచిచూడాల్సిందే..