Begin typing your search above and press return to search.

టీడీపీ ఆంధ్రా పార్టీ అంటే చెప్పుతో కొట్టాల‌ట‌

By:  Tupaki Desk   |   27 Oct 2016 2:48 PM GMT
టీడీపీ ఆంధ్రా పార్టీ అంటే చెప్పుతో కొట్టాల‌ట‌
X
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్- శాస‌న‌స‌భాప‌క్ష నేత‌ అనుముల రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య‌నేత‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ‌భ‌రితంగా ప్ర‌సంగించారు. సొంత‌ జిల్లా మహబూబ్ న‌గర్‌లో నిర్వ‌హించిన పార్టీ ముఖ్యనాయకుల సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ కష్టాలు ఉన్నాయని దిగాలు పడి ఇంట్లో కూర్చుంటే లాభం లేదన్నారు. కష్టాలు ఉన్నప్పుడు కలబడి, నిలబడిన వాడే మొనగాడని పేర్కొంటూ టీడీపీ కార్యకర్తలు అలాంటి మొనగాళ్లేనని మరో సారి మనం నిరూపించాలని ఉద్బోధించారు. ఎవరైన తెలుగుదేశం పార్టీని ఆంధ్రా పార్టీ అని విమర్శిస్తే అలాంటి వారిని చేతితో కాకుండా ఎడమ కాలి చెప్పుతో కొట్టి సమాధానం చెప్పాలని పార్టీ నేత‌ల‌కు రేవంత్ సంచ‌ల‌న పిలుపునిచ్చారు.

గతంలో టీడీపీ కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు వేశాం కాబ‌ట్టి ఒక్కసారి తెలంగాణ కోసం పోరాడిన పార్టీకి ఓటు వేసి చూస్తామని టీఆర్ ఎస్‌ కు ఓటు వేసి గెలిపించిన పాపానికి రాష్ట్రం మొత్తాన్ని కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్టం వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటిపోయిన ఇప్పటి వరకు పేదలకు డబ్బుల్ బెడ్ రూం ఇళ్లు - మూడెకరాల భూమి - విద్యార్థులకు ఫీజు రీయింబ‌ర్స్‌ మెంట్‌ - గిరిజన - మైనార్టీ వర్గాల వారికి 12% రిజర్వేషన్లు ఇంటికొ ఉద్యోగం వచ్చాయా అని రేవంత్ ప్రశ్నించారు. నీళ్లు - నిధులు - నియామకాలు అంటూ మాయ చేసిన కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్క ఎకరాకైనా అదనంగా నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలో నిర్మాణంలో ఉన్న కల్వకుర్తి - భీమా - నెట్టంపాడు - కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు ఇప్పటి వరకు రూ. 9వేల కోట్ల దాకా ఖర్చు అయితే, అందులో టీఆర్ ఎస్ పెట్టింది కేవలం 390 కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు. ఒక వైపు పేదల డబుల్ బెడ్ రూం ఇళ్లకు - ఆరోగ్యశ్రీ పథకానికి - విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ కు ఇవ్వడానికి నిధులు లేవని చెబుతునే మరో వైపు తాను 10 ఎకరాలలో కొత్త బంగళ కట్టుకోవడం - ఇల్లుపీకి పందిరేసినట్లు వాస్తు దోషం ఉందని పాత సెక్రటరియేట్‌ను పడగొట్టి కొత్త సెక్రటరియేట్‌ కట్టుకోవడానికి వందల కోట్ల ఖర్చుపెట్టాలని నిర్ణయించడం ఎంత వరకు సబబు అని కేసీఆర్ ను నిలదీయాల్సిన సమయం అసన్నమైందని రేవంత్ సూచించారు. టీడీపీ హయాంలో దళిత కాలనీలు - గిరిజన తండాలు పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ చదువుకునే అవకాశం కల్పిస్తే ప్రస్తుతం కేసీఆర్ తండాలు, కాలనీలలో ఉన్న పాఠశాలలను కూడా సంఖ్యబలం లేదన్న కారణంగా మూసివేస్తున్నారని విమర్శించారు.

తెలుగుదేశం పార్టీని ఆంధ్ర పార్టీ అంటే వారిని చేత్తో కొట్టకూడదని ఎందుకంటే చేత్తో కొడితే మరిచిపోతారు కాబ‌ట్టి అలాంటి వారిని ఎడమ కాలి రబ్బరు చెప్పుతో కొట్టి బుద్ది చెప్పాలని రేవంత్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డమీద - హైదరాబాద్ పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే అని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న పటేల్ - పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది కూడా తెలుగుదేశం పార్టీయేనని చెప్పారు. పేద ప్రజల కోసం ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని సమూలంగా తుడిచిపెట్టాలని ప్రయత్నించిన వారెవ్వరు కూడా చరిత్రలో మిగల్లేదన్నారు. కేసీఆర్ నియంతలా పరిపాలిస్తున్నారని, అయితే, చరిత్ర చూస్తే ఏ నియంత పరిపాలన కూడా శాశ్వతంగా నిలబడలేదని చెప్పారు. అందుకే టీడీపీ శ్రేణులు కూడా టీఆర్ఎస్ను ఎదుర్కొవడంలో వెనుకంజ వేయకూడదన్నారు. ప్రస్తుతం రానున్న నవంబర్ నెల పార్టీకి అత్యంత కీలకమని ఈ నెలలోనే ప్రతి క్రీయాశీల కార్యకర్త మరో పది మంది క్రీయాశీల కార్యకర్తలను తయారు చేయాలని సూచించారు. 'గ్రామంలో కూర్చొండి. రోడ్డు చూపించి దానిని ఎవరు వేశారో అడగండి. బడి చూపండి. దానిని ఎవరు కట్టించారో అడగండి. నీళ్ల ట్యాంకు చూపించండి దానిని ఎవరు కట్టారో అడగండి. ఎస్సీ కాలనీలలో సీసీ రోడ్లు ఎవరు వేయించారో. అంగన్ వాడి భవనాలను ఎవరు కట్టారో. అగడండి. అంతా చేసింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అన్న విషయం అందరికీ గుర్తు చేయండి. ఇప్పుడు కష్టాల్లో ఉన్న మీకు మేము తోడుంటామని హామీ ఇవ్వండి. ఉపాధి హామీ కూలీలు వచ్చాయా? ఫీజు రీయింబర్స్ మెంట్ మొత్తాలు అందాయా? ఆరోగ్య శ్రీలో చికిత్సలు జరుగుతున్నాయా అని వారిని పరామర్శించండి. ప్రస్తుతం పేదలు తమ కష్టాలు వినే నాధుడు లేక ఎవరు తమ గోస వినడానికి వస్తారా అని ఎదురు చూస్తున్నారు. వారికి దైర్యం చెప్పండి. పేదలకు అండ పసుపు జెండా అని చాటి చెప్పండి” అని రేవంత్ పార్టీ శ్రేణులకు భోదించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/