Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లోకి రేవంత్‌... మార్గ‌ద‌ర్శనం బాబు

By:  Tupaki Desk   |   18 Oct 2017 5:13 AM GMT
కాంగ్రెస్ లోకి రేవంత్‌... మార్గ‌ద‌ర్శనం బాబు
X
తెలంగాణ టీడీపీ కార్య‌నిర్వాహ‌క‌ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ లో చేరుతున్నార‌నే ప్ర‌చారంలో మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చింది. సుప్రీంకోర్టు పనిమీద రేవంత్‌ ఢిల్లీ వెళ్లారని రేవంత్ రెడ్డి స‌న్నిహితులు చెప్తున్న‌ప్ప‌టికీ ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని రేవంత్‌ రెడ్డి కలుసుకున్నారని వార్తలు హ‌ల్‌ చ‌ల్ చేస్తున్నాయి. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పక్కా ప్లానింగ్‌ తోనే జ‌రిగింద‌ని తెలుస్తోంది. కాంగ్రెస్‌ లో చేరేందుకు సిద్ధ‌మైన రేవంత్ రెడ్డి తన డిమాండ్లను రాహుల్ గాంధీ ముందు పెట్టారని చెబుతున్నారు. దాదాపు 15 నుంచి 20 మంది కీలకనేతలు రేవంత్‌ వెంట వెళతారని సమాచారం. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరితే టీడీపీలో ఉన్నట్టుగానే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవితోపాటు 15 ఎమ్మెల్యే సీట్లు డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ విషయంలో రాజీ కుదిరితే ఇక లాంఛనంగా కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడమే తరువాయి అని తెలిసింది. ఈలోపు రాహుల్‌ కు పార్టీ అధ్యక్షత బాధ్యతలు సైతం అప్పగిస్తారని - అనంతరమే రేవంత్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం.

మ‌రోవైపు ఇటీవల విజయవాడలో పార్టీ అధినేత‌ చంద్రబాబును రేవంత్‌ రెడ్డి కలసుకున్న సమయంలోనే అన్ని విషయాలు చెప్పుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న టీడీపీలో ఉన్న నేతలు కొంతమంది టీఆర్‌ ఎస్‌ తో సంబంధాలు పెట్టుకుని ఏ రకంగా లాభాలు పొందింది కూడా వివరాలు వెల్లడించినట్టు తెలిసింది. ఈ సంద‌ర్భంగానే పార్టీ మారే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం రేవంత్‌ చెప్పారని, `నీకు ఎలా వీలైతే అలా చేసుకో`` అని ఆయన కూడా సలహా ఇచ్చినట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉండగా, తెలంగాణలో టీఆర్‌ ఎస్‌ కు వ్యతిరేకంగా టీడీపీ పోరాటాలు చేయలేకపోతున్నదన్న భావనతోపాటు అంతర్గతంగా టీఆర్‌ ఎస్‌ తో పొత్తు పెట్టుకునేందుకు సిద్దమవడంతో రేవంత్‌ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. అందుకే ఆయన పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. డిసెంబరు లేదా జనవరిలో రేవంత్‌ కాంగ్రెస్‌ లోకి వెళ్లడం ఖాయమని తెలుస్తోంది.

కాగా, ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు ముందు ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ వెళ్లేముందు రేవంత్‌ తన కుటుంబంతో కలిసి కొల్లాపూర్‌ వెళ్లారు. అక్కడ నుంచి బెంగళూరు వెళ్లారని - ఆ తరువాత బెంగళూరు నుంచి ఢిల్లీ చేరుకున్నారని, అక్కడే రాహుల్‌ ను కలిశారని అంటున్నారు. అయితే ఇవన్నీ ఉహాగానాలేనని రేవంత్‌ ఢిల్లీలో తనను కలిసిన కొంతమంది మీడియాతో చెప్పారు. అయితే టీవీల్లో వచ్చిన వార్తలన్నీ కరెక్టు కాదని.. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన ఒక కేసు విషయంలో తన న్యాయవాదితో మాట్లాడేందుకు వెళ్లారని రేవంత్ రెడ్డి స‌న్నిహితులు అంటున్నారు. కావాలనే టీడీపీలోని కొంతమంది నేతలు రేవంత్‌ కు వ్యతిరేకంగా ఇలాంటి ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

దీపావళి పండుగ తరువాత వారం రోజులపాటు ఆయన తన నియోజకవర్గం కొడంగల్‌ లో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం - కార్యకర్తలు - పార్టీకి చెందిన ఆయా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటి కానున్నారు. పార్టీ మారి కాంగ్రెస్‌ లోకి వెళ్లే విషయమై వారితో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆ తరువాత జనవరిలో కీలకపరిణామం ఉండే అవకాశం ఉందని రేవంత్‌ అనుచరులు అంటున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఇప్పటికే సూత్రప్రాయంగా గ్రీన్‌ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం.