Begin typing your search above and press return to search.

రేవంత్‌ కు ప‌ద‌వికి రాహుల్ ఓకే..ఇదే నిద‌ర్శ‌నం

By:  Tupaki Desk   |   15 Aug 2018 6:51 AM GMT
రేవంత్‌ కు ప‌ద‌వికి రాహుల్ ఓకే..ఇదే నిద‌ర్శ‌నం
X
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రెండు రోజుల సుడిగాలి ప‌ర్య‌ట‌న ముగిసింది. రాజ‌ధాని హైద‌రాబాద్ కేంద్రంగా ప‌ట్టును పెంచుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా సాగిన కాంగ్రెస్ సార‌థి టూర్‌ ను రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం అవ‌డం పార్టీ నేతల్లో నూతనోత్సవం నింపింది. ఈ మేర‌కు పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి స‌ర్వం తానై ప‌ర్య‌ట‌న‌ను నిర్వ‌హించారు. అదే సమయంలో పార్టీ నేతల మధ్య సమన్వయం లోపం కొట్టినట్టు కనిపించింది. పార్టీ నేతల్లో గ్రూపులు తగాధాలు - అంతర్గత కుమ్ములాటలు - ఒకరంటే ఒకరికి పడక పోవడంతో దాని ప్రభావం రాహుల్‌ పర్యటనపై పడినట్టు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇక రాహుల్ టూర్‌ లో చోటుచేసుకున్న మ‌రో ప‌రిణామం...టీడీపీలో నుంచి కాంగ్రెస్‌ లో చేరిన ఫైర్‌ బ్రాండ్ లీడ‌ర్ రేవంత్ రెడ్డి పాత్ర‌.

వివిధ వ‌ర్గాల ప్ర‌కారం రాహుల్‌ టూర్‌ లో రేవంత్‌ రెడ్డి హవా కనిపించింది. శంషాబాద్‌ - శేరిలింగంపల్లి సభలలో ఆయన మాట్లాడతారని కార్యకర్తలు భావించినా... ఆయనకు మాట్లాడే అవ‌కాశం రాలేదు. అయితే ఆయన మాట్లాడాలని సభికుల నుంచి డిమాండ్‌ రావడంతో సరూర్‌ నగర్‌ సభలో మాట్లాడినట్టు తెలిసింది. ఈ సభలో ఆయన మాట్లాడుతున్న సేపు కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఆయన ప్రసంగాన్ని రాహుల్‌ గాంధీ సైతం ఆసక్తిగా తిలకించడం విశేషం. దీంతోపాటుగా ఈ టూర్‌ లో రాహుల్ రేవంత్‌ తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. పార్టీ గురించి ఆరాతీసినట్లు స‌మాచారం.

ఈనెల‌లోనే ఢిల్లీలో రేవంత్‌ తో స‌హా పార్టీ ముఖ్యుల‌తో రాహుల్‌ గాంధీతో స‌మావేశం కానున్నార‌ని తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగానే పార్టీలో కొత్త నియామ‌కాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌నున్నార‌ని చెప్తున్నారు. కీల‌క‌మైన ఈ స‌మావేశం పూర్త‌యిన త‌ర్వాత రేవంత్ రెడ్డిని ప్ర‌చార క‌మిటీ చైర్మన్‌ గా నియ‌మిస్తార‌ని అంటున్నారు.