Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు గుడి బ‌దులు ఘోరీ క‌ట్టారు

By:  Tupaki Desk   |   27 April 2017 3:52 PM GMT
కేసీఆర్‌ కు గుడి బ‌దులు ఘోరీ క‌ట్టారు
X
ఉస్మానియా యూనివ‌ర్సిటీ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌సంగించ‌క‌పోవ‌డంపై తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఘాటు కామెంట్లు చేశారు. 3 సంవత్సరాలు చెప్పిన అబద్దాలు చెప్పని కేసీఆర్ కు నిన్న మంచి గుణపాఠం చెప్పారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ``ఓయూలో నిన్న మంచి పాఠం జరిగింది. ఓయూలో తెలంగాణలోని అన్ని ప్రాంతాల విద్యార్థులు ఉంటారు. ఓయూలో జరిగిన ప్రతి దానికీ తెలంగాణ సమాజం ఆమోదం ఉంటుంది,.ఓయూలో తనకు గుడి కడుతారని కేసీఆర్ చెప్పుకున్నారు. కానీ 3 సంవత్సరాలలో ఘోరీ కట్టడానికి విద్యార్థులు రెడీ అయ్యారు`` అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఓయూ విద్యార్థుల ముందు కేసీఆర్ తలయెత్తుకొని నిలబడే ధైర్యం చేయలేదని వ్యాఖ్యానించారు. ``విద్యార్థుల కళ్ళలోకి చూసే ధైర్యం లేదు - అమరవీరుల కుటుంబాలు నిన్న సంతోషించాయి. ఓయూ విద్యార్థులకు అభినందనలు. ప్రగతి నివేదిక సభ కాదు దోపిడీ దొంగల సభ. ఈరోజు తెలంగాణలో దోపిడీ దొంగతనాలు జరగవు. ఎందుకంటే దొంగలు అందరూ వరంగల్ సభకు వెళ్లారు`` అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. తొలి సభలోనే అమరవీరుల కుటుంబాలకు, ఇంటికో ఉద్యోగం, 10లక్షల ఆర్థిక సహాయం అన్నారని అయితే ఎంత మందికి ఇచ్చారో కేసీఆర్ సభలో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 3 సంవత్సరాలలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని, నిరుద్యోగులను మోసం చేసిన విషయాన్ని సభలో చెప్పుకోవాలని కోరారు. 3 సంవత్సరాలలో కొత్త ఉద్యోగులకంటే రిటైర్డ్ అయ్యిన వారే ఎక్కువని రేవంత్ పేర్కొన్నారు.

కేజీ టు పీజీ విద్య విషయంలో చేసిన మోసాన్ని కూడా సభలో చెప్పండి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేజీ లేదు పీజీ లేదని ఎద్దేవా చేశారు. దళితులకు గిరిజనులకు ఎప్పటి లోపు భూమి కేటాయిస్తారో నివేదిక ఇవ్వాలని కోరారు. 3 సంవత్సరాలలో 22 లక్షల మందికి ఇవ్వాల్సిన ఇండ్లు 1400 మందికి మాత్రమే ఇచ్చారని తెలిపారు. ``ఇండ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎక్కడికి పోయావో సభలో చెప్పాలి. కో అంటే కోటి అని కోట్లకు పడగలెత్తాడు. రైతే రాజు అయ్యాడు అంటున్నారు, కానీ 3 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు. రుణమాఫీ చేసానని చెప్పుకొంటున్నారు, కానీ రైతు పాస్ బుక్ లు మాత్రమే బ్యాంక్ లోనే ఉన్నాయి. ఇచ్చినవి వ‌డ్డీ కిందికి పోయాయి`` అని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

తండ్రి కేసీఆర్‌ వ్యవసాయం చేస్తే 1 కోటి వస్తే...కొడుకు ఐస్ క్రీం అమ్మితే 5 లక్షలు వ‌చ్చాయ‌ని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ``కూతురు చీరలు అమ్మితే 10 లక్షలు, ఇక మంత్రులు ఏ పని చేసిన లక్షలే. 5 లక్షలకు ఐస్ క్రిము అమ్మిన కేటీఆర్ ఒక బస్తా మిర్చి అమ్ము. 10వేలు రైతులకు ఇచ్చి మిగతాది మీరే తీసుకోండి`` అంటూ ఎద్దేవా చేశారు. గులాబీ కూలి పేరుతో వసూలు చేసినవి ముమ్మాటికీ అవినీతన‌ని రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. నియోజకవర్గానికి 10కోట్ల చొప్పున వసూళ్లు చేశారని, ఈ పది రోజుల్లో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఆయ‌న ఆరోపించారు. అవినీతిపరులైన వ్యాపారుల వద్ద బహిరంగంగా లక్షల రూపాయ‌లు మంత్రులు తీసుకున్నారని విమ‌ర్శించారు. గులాబీ కూలీ పేరుతో వెయ్యి కోట్ల అవినీతి పై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తే జైల్ కు పంపుతామని కేసీఆర్ అన్నాడని, మంత్రులు అందరూ దోపిడీకి పాల్పడ్డారని రేవంత్ ఆరోపించారు. గులాబీ కూలీపై కోర్టులకు కూడా వెళ్తామ‌ని, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/