Begin typing your search above and press return to search.

కేసీఆర్‌కు రేవంత్ కొత్త శాపం

By:  Tupaki Desk   |   9 Feb 2016 3:55 PM GMT
కేసీఆర్‌కు రేవంత్ కొత్త శాపం
X
కొన్నిసార్లు అంతే.. ఎంత కొట్టుకున్నా ప‌రిస్థితులు అనుకూలంగా మార‌వు. ప్ర‌స్తుతం తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి అలానే ఉంది. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉండి కూడా కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం రెండు రోజ‌ల పాటు హైద‌రాబాద్ వీధుల్లో తిరిగేందుకు చంద్ర‌బాబు సంకోచించ‌లేదు. తాను సీఎం అన్న‌భేష‌జానికి కూడా పోలేదు. అన్నింటికి మించి తాను ప్ర‌చారం చేసినా.. పార్టీ ఘోర ప‌రాజ‌యం పాలైతే జ‌రిగే న‌ష్టం కూడా ఆయ‌న‌కు తెలియందికాదు. ఇన్ని చేసినా.. ఆయ‌న ప‌డిన క‌ష్టానికి ఏ మాత్రం ఫ‌లితం ద‌క్క‌క‌పోవ‌ట‌మేకాదు.. తాజాగా ఎదురుదెబ్బ త‌గిలిన ప‌రిస్థితి.

అడ్డాల నాడు పిల్ల‌లు కానీ గ‌డ్డాల నాడుకాద‌న్న మాట‌కు త‌గ్గ‌ట్లే.. ఎన్నిక‌ల‌ప్పుడు పార్టీ టిక్కెట్టు ఇచ్చేట‌ప్పుడు మాత్ర‌మే అభ్య‌ర్థులు కానీ.. ఒక్క‌సారి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత వారి ప‌రిస్థితి మొత్తంగా మారిపోతుంది. పార్టీ టిక్కెట్టు కోసం ప్ర‌య‌త్నాలు చేసే ప‌రిస్థితి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. విప‌క్షంలో ఉండాల్సి వ‌స్తే.. స‌ద‌రు నేత‌ల్ని కాపాడుకోవ‌టం ఇప్పుడంత తేలిక కాదు. అందులోకి ఆక‌ర్ష్ రాజ‌కీయాలు బ‌లంగా మారిన ఈ రోజుల్లో ఏ ఎమ్మెల్యే ఏం చేస్తారో అర్థం కాని ప‌రిస్థితి. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో పార్టీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత.. పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేల్లో కొంద‌రైనా పార్టీ విడిచిపెట్ట‌టం ఖాయ‌మ‌న్న విష‌యం బాబు అండ్ కోకు తెలియంది కాదు.

వారు అనుకున్న‌ట్లే తాజాగా కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ పార్టీని విడిచి టీఆర్ఎస్ కండువాను క‌ప్పుకోవ‌టం చూసిన టీటీడీపీ నేత‌ల‌కు క‌డుపు మండిపోయిన ప‌రిస్థితి. దీంతో.. త‌మ ఆక్రోశాన్ని వ్య‌క్తం చేసేందుకు వారు విమ‌ర్శ‌లు వ‌దిలేసి శాపాలు పెట్టేస్తున్న తీరు చూస్తే.. వారి బాధ ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం అన్న‌ది లేకుండా చేయాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నార‌ని ఇదేమాత్రం స‌రికాద‌ని.. చ‌రిత్ర పున‌రావృతం కాక త‌ప్ప‌దంటూ మండిప‌డిన టీటీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డి.. మ‌రో మాట‌ను అనేశారు.

ఈ మ‌ధ్య‌కాలంలో కేసీఆర్‌ను త‌ర‌చూ శాపాలు పెడుతున్న రేవంత్‌.. తాజాగా మ‌రో శాపం పెట్టేందుకు వెనుకాడ‌లేదు. విప‌క్షాల‌ను దెబ్బ తీసేలా ఫిరాయింపుల్ని ప్రోత్స‌హిస్తున్న ముఖ్య‌మంత్రి ఇంట్లోనూ ముస‌లం పుడుతుంద‌ని.. త‌గిన శాస్తి జ‌రుగుతుంద‌ని భ‌విష్య‌త్తులో జ‌రుగుతుందో లేదో కానీ విష‌యాన్నిముందే ఊహించేస్తూ వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. శాపాల పేరిట నోటికి వ‌చ్చేసిన‌ట్లు మాట్లాడే క‌న్నా.. వ్యూహాత్మ‌క మౌనం మంచిదేమో..?