Begin typing your search above and press return to search.

కేసీఆర్ కుటుంబానికి రోజుకు కోటిలంచం!!

By:  Tupaki Desk   |   25 July 2017 4:26 PM GMT
కేసీఆర్ కుటుంబానికి రోజుకు కోటిలంచం!!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై అవ‌కాశం దొరికినప్పుడ‌ల్లా విరుచుకుప‌డే తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మ‌రోమారు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బాధితుల‌కు న్యాయం చేస్తూనే ఈ క్ర‌మంలో సీఎం కేసీఆర్ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిరిసిల్లా నియోజ‌క‌వ‌ర్గంలోని నేరెళ్ల గ్రామంలో ఇసుక మాఫియా విష‌యంలో జ‌రిగిన ఘ‌ట‌న‌లో ద‌ళితుల‌పై దాడి జ‌రిగింది. ఈ బాధితుల‌తో స‌మావేశ‌మైన రేవంత్ ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కరీంనగర్‌ జిల్లా నేరెళ్ల గ్రామస్తులు హైదరాబాద్‌ లోని ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌ లో రేవంత్ రెడ్డిని కలిసి తమ బాధలు విన్నవించారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రశ్నించినందుకు 8 మందిపై కేసులు పెట్టారని చెప్పారు. కరీంనగర్‌లో సీఎం కేసీఆర్‌ బంధువులు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారని బాధితులతో మాట్లాడిన అనంతరం రేవంత్‌ ఆరోపించారు.

సీఎం కేసీఆర్ కుటుంబానికి ఇసుక మాఫియా రూపంలో రోజుకు రూ.కోటి ముడుపులు ద‌క్కుతున్నాయ‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంత్రులు పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి - జూపల్లి కృష్ణారావు - జగదీశ్‌ రెడ్డి బంధువులు కూడా ఇసుక అక్రమ రవాణాలో భాగస్వాములయ్యారని విమర్శించారు. కరీనంనగర్‌ జిల్లాలో అక్రమ రవాణా మూలంగా రోజుకు రూ. కోటి మేర ప్రభుత్వం ఆదాయం కోల్పోతున్నదని వివరించారు. లారీల్లో ఓవర్‌ లోడ్‌ లు పంపుతూ - ప్రశ్నించినవారిని, ఎదురొచ్చిన వారిని తొక్కించి చంపేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్‌ - మహబూబ్‌ నగర్‌ - వరంగల్‌ జిల్లాల్లోనూ ఆ జిల్లాకు చెందిన మంత్రులు - టీఆర్‌ ఎస్‌ నాయకులే ఇసుక కాంట్రాక్టులు తీసుకుని కోట్ల రూపాయాలు కొల్లగొడుతున్నారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో ఇసుకను తోడుకుంటున్న వ్యవహారం గురించి గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. నేరెళ్ల ఘటనలో బాధితులుగా ఉన్న వారికి టీఎస్‌ ఎండీసీ ద్వారా ఒక్కొక్కరికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు.