ఈ హీరోయిన్ ఇక్కడి నుంచి పోటీచేస్తుందట..!

Tue Oct 23 2018 16:10:28 GMT+0530 (IST)

సినీ నటి రేష్మా ఇటీవలే బీజేపీలో చేరారు.. బీజేపీ నుంచి ఈ ఎన్నికల్లో పోటీచేయాలని  ఉబలాటపడుతున్నారు. మహిళా కోటాలో ఆమెకు బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి పదవి కూడా  వరించింది.  మొదట రేష్మా ఎస్టీ కావడంతో మహబూబాబాద్ ఎంపీ గా బీజేపీ తరఫున పోటీచేయాలని స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా ఆ పార్లమెంట్ పరిధిలో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు చేరువయ్యారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే మేలో ఉండడంతో అంతకంటే ముందు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వైపు దృష్టిసారించారు.తాజాగా రేష్మా రాథోడ్ వైరా నియోజకవర్గంలో బీజేపీ తరుఫున పోటీచేయాలని ఆసక్తి చూపుతున్నారట.. ఈ మేరకు ఆమె పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తన వినతిని కూడా అందించినట్లు తెలిసింది.

ఆమె స్వతహాగా ఖమ్మం జిల్లా వాసి. ఇల్లెందు - కారేపల్లి ప్రాంతాలతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో   వైరా నుంచి పోటీచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.. వైరాలో ఇప్పటికే టీఆర్ ఎస్ - కాంగ్రెస్ - వైసీపీ తరుఫున బలమైన అభ్యర్థులున్నారు. ఈమెకు ఆశలు లేకున్నా పార్టీ బలాన్ని పెంచుకునేందుకు ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలని ఆమె భావిస్తున్నట్టు తెలిసింది.