Begin typing your search above and press return to search.

రూ.2 వేల నోటు ప్రింటింగ్ అయిపోయిందా?

By:  Tupaki Desk   |   23 Oct 2016 5:14 AM GMT
రూ.2 వేల నోటు ప్రింటింగ్ అయిపోయిందా?
X
భారీ డినామినేషన్ ఉన్న వెయ్యి.. రూ.500 నోట్లను రద్దు చేయాలని పలు సంస్థలతో పాటు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కాలంలో పదే పదే చెబుతున్నారు. దేశంలో నల్లధనానికి చెక్ చెప్పాలంటే పెద్ద నోట్లను రద్దు చేయటం మినహా మరో మార్గం లేదని చెబుతున్నారు. చంద్రబాబు లాంటోళ్లు ఇలా ఆలోచిస్తుంటే కేంద్రం ఆలోచనలు మరోలా ఉన్నాయి. ఇప్పటివరకూ దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీలో అత్యధిక విలువ ఉన్న వెయ్యి రూపాయిల నోటు స్థానంలో రూ.2వేల నోటును తీసుకొచ్చే కసరత్తు మొత్తం పూర్తి అయ్యిందని తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం రూ.2వేల నోట్లను ముద్రించటమే కాదు.. దాన్ని దేశంలోని వివిధ క్లస్టర్లకు పంపిణీ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మైసూర్ లోని మింట్ లో రూ.2వేల నోటును ప్రింటింగ్ చేశారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో పెరుగుతున్న ధరల పుణ్యమా అని పెద్ద నోట్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఇప్పుడున్న వెయ్యితోపాటు.. రూ.2వేల నోట్లను ముద్రించాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. ఇందులోభాగంగా ఇప్పటికే మైసూర్ లో రూ.2వేల కరెన్సీ నోటును ముద్రించేసి.. ఆయా కరెన్సీచెస్ట్ లకు పంపినట్లుగా చెబుతున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా.. పలువురు పెద్ద నోట్లను నిషేధించాలంటూ మాట్లాడటంతోపాటు.. త్వరలో జరిగే ఏపీ అసెంబ్లీలో పెద్ద నోట్లను నిషేధించాలని కోరుతూ తీర్మానం చేయాలని నిర్ణయించారు. బాబు లాంటి వాళ్లు ఇలాంటి ఏర్పాట్లు చేస్తుంటే.. మరోవైపు కేంద్రం ఉన్న పెద్ద నోట్లను తొలగించే పని వదిలేసి.. పెద్ద విలువ ఉన్న కరెన్సీని ప్రింటింగ్ ప్రక్రియను పూర్తి చేయటం ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం 2016 మార్చి నాటికి దేశంలో రూ.16,41,500 కోట్ల కరెన్సీ చలామణిలో ఉంది. గత ఏడాదితో పోలిస్తే.. ఇది 15 శాతం వృద్ధితో సమానమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ భారీ మొత్తంలో రూ.వెయ్యి.. రూ.500 నోట్లే 84 శాతం మేర ఉండటం గమనార్హం.

మరోవైపు.. రూ.2వేల విలువ ఉన్న కరెన్సీ నోటుకు సంబంధించిన ఆసక్తికర అంశాలు కొన్ని బయటకు వచ్చాయి. ఈ నోటు తయారీకి రూ.3 ఖర్చు అయినట్లు చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే.. కొత్తగా ప్రింటింగ్ చేసిన రూ.2వేల నోటును అతి త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసి.. విడుదల చేస్తారని చెబుతున్నారు. ఇప్పుడు రూ.2వేల నోటు గురించి మాట్లాడుకుంటున్నాం కానీ.. 1978కు ముందే దేశంలో రూ.10వేలు.. రూ.5వేల నోట్లనుకూడా ముద్రించే వారు. అయితే.. నల్లధనాన్ని అరికట్టేందుకు వీలుగా రూ.10వేలు.. రూ.5వేలు.. రూ.వెయ్యి నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత 2000 సంవత్సరంలో వెయ్యి రూపాయిల నోటును తిరిగి మార్కెట్ లోకి తీసుకొచ్చారు. దాదాపు 16 సంవత్సరాల విరామం తర్వాత రూ.2వేల నోటును తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరి.. ఈ ముచ్చట మీద ఏపీ ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/