Begin typing your search above and press return to search.

రిజ‌ర్వేష‌న్ల వ‌ల్లే విద్యార్థులు బ‌ద్ద‌కిస్టుల‌య్యారు:జేపీ

By:  Tupaki Desk   |   21 Sep 2017 9:39 AM GMT
రిజ‌ర్వేష‌న్ల వ‌ల్లే విద్యార్థులు బ‌ద్ద‌కిస్టుల‌య్యారు:జేపీ
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని టీడీపీ ప్ర‌భుత్వ ప‌నితీరుపై లోక్‌ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ మండిప‌డ్డారు. రిజ‌ర్వేష‌న్ల వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డం ద్వారా విద్యార్థుల‌ను ప్ర‌భుత్వం బ‌ద్ధ‌క‌స్తుల‌ను చేస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌భుత్వ కాలేజీల్లో లెక్చ‌ర‌ర్ల ప‌రిస్థితి అతివృష్టి - అనావృష్టి అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. త‌క్కువ మంది విద్యార్థులున్న చోట అధిక సంఖ్య‌లో లెక్చ‌ర‌ర్లున్నార‌ని, ఎక్కువ మంది విద్యార్థులున్న చోట త‌క్కువ మంది లెక్చ‌ర‌ర్లున్నార‌ని చెప్పారు. ఈ ర‌క‌మైన తార‌తమ్యం వ‌ల్ల విద్యార్థుల‌కు చాలా న‌ష్టం జ‌రుగుతోంద‌ని జేపీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇటువంటి లోప‌భూయిష్ట విధానాలను స‌మూలంగా మార్చేందుకు తాను 'సురాజ్య యాత్ర'ను చేపడుతున్నట్లు జేపీ తెలిపారు. ఆ యాత్ర‌లో భాగంగా తూర్పు గోదావ‌రిలో ప‌ర్య‌టిస్తున్న‌ జేపీ కాకినాడ‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు.

ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జేపీ.... ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడుపై మండిప‌డ్డారు. యనమల సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన తునిలో ఉన్న‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 650 మంది విద్యార్థులకు గానూ ఆరుగురు లెక్చరర్లే ఉండ‌డం దారుణ‌మ‌న్నారు. స‌గ‌టున 100 మంది విద్యార్థుల‌కు ఒక లెక్చ‌ర‌ర్ ఉన్నారని, వారు విద్యార్థుల‌కు ఏ విధంగా న్యాయం చేయ‌గ‌ల‌ర‌ని జేపీ ప్ర‌శ్నించారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో విద్యార్థుల ప‌రిస్థితి ఈ విధంగా ఉన్నా - య‌న‌మ‌ల ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు. ప్ర‌భుత్వ కాలేజీల్లో ప‌రిస్థితి ఇంత దారుణంగా ఉండ‌డం వ‌ల్లే త‌ల్లిదండ్రులు త‌ల‌కు మించిన భారాన్ని మోస్తూ త‌మ పిల్ల‌ల‌ను ప్రైవేటు కాలేజీల్లో చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు కడప జిల్లా మైదుకూరులో 50 మంది విద్యార్థులున్న డిగ్రీ కళాశాలలో 13 మంది లెక్చరర్లున్నారని జేపీ అన్నారు. ఈ తార‌త‌మ్యాన్ని స‌రిచేయ‌వ‌ల‌సిన ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్త‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.

రాష్ట్రంలో ప్రాథ‌మిక విద్యా వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని జేపీ అభిప్రాయ‌పడ్డారు. ప్రాథ‌మిక స్థాయిలో నాణ్య‌మైన విద్య‌ను అందించ‌కుంటే, ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించే స‌మ‌యంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతార‌ని జేపీ చెప్పారు. కొన్ని స్కూళ్ల‌లో కూడికలు - తీసివేత - భాగాహారం వంటి ప్రాథ‌మిక విష‌యాలు కూడా తెలియని 8వ తరగతి విద్యార్థులుండ‌డం బాధాక‌ర‌మ‌ని జేపీ అన్నారు. త‌మ పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం తల్లిదండ్రులు తమ శ‌క్తికి మించి చదివిస్తున్నా, ఆశించినస్థాయిలో ఫ‌లితాలు రావ‌డం లేద‌ని చెప్పారు. రిజర్వేషన్ల పేరిట విద్యార్థులను ప్రభుత్వం బద్దకస్తులను చేస్తోందని జేపీ ఆరోపించారు. విద్యార్థుల‌కు రిజర్వేషన్లు కల్పించి ఉన్నతవిద్యను అందించి నిరుద్యోగులుగా చేయటం క‌న్నా, ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. దేశాన్ని ముందుకు నడిపించే విద్యార్థులు ముందుకు రావాలని జేపీ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో టీడీపీ పాల‌న పై జేపీ మండిప‌డ్డారు. ఏ ప్రభుత్వమైనా ప్ర‌జ‌ల‌కు శాంతి భద్రత, రక్షణ, న్యాయం కల్పించాలని జేపీ అన్నారు. ఎంతో ఘ‌న చ‌రిత్ర క‌లిగిన కాకినాడ ప‌రిస్థితి అధ్వాన్నంగా ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం కాకినాడ న‌గ‌రంలో న‌లువైపులా మురికికంపు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీ వ్యవస్థతో ప్రజలు నానా అగ‌చాట్లు ప‌డుతున్నార‌న్నారు. మౌలిక వ‌స‌తుల‌పై ప్ర‌భుత్వం చిన్న చూపు చూడ‌డం త‌గ‌ద‌ని జేపీ అన్నారు. కేవ‌లం ఎన్నిక‌ల‌పుడు మాత్ర‌మే ప్ర‌భుత్వానికి కాకినాడ ప్ర‌జలు గుర్తుకు వ‌స్తార‌ని, మిగిలిన స‌మ‌యాల్లో నాయ‌కులు ఇటువైపు క‌న్నెత్తి కూడా చూడ‌ర‌ని చెప్పారు. ప్ర‌జాసంక్షేమంపై ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స్పందించాల‌ని జేపీ కోరారు.