ఈ నిర్ణయంతో మోడీ మునిగుతాడా.. తేలుతాడా?

Sat Jan 12 2019 20:00:01 GMT+0530 (IST)

సామాన్యుడు.. టీవాలా అని చెప్పుకున్న మోడీ మాటలను నమ్మి దేశప్రజలు ఆయనకు పట్టం కట్టారు. విదేశాల్లోని నల్లడబ్బును తీసుకొస్తానని చెప్పితే సంబరపడి ఓట్లేశారు. జన్ ధన్ ఖాతాలు తెరిచారు. అర్ధరాత్రి పెద్దనోట్లు రూ.500 - రూ.1000 నోట్లను రద్దు చేసినప్పుడు ఆయన వెంటే నిలిచారు. బీజేపీ గెలిస్తే విదేశాల్లోని నల్లడబ్బు తెచ్చి ప్రతి అకౌంట్ లో రూ.15లక్షల డబ్బు జమ చేస్తానన్న ప్రధాని ఆ హామీని నిలబెట్టుకోలేదు. పైగా పెద్ద నోట్లు రద్దు చేసి జనాలను బ్యాంకుల ముందు క్యూ కట్టించాడు. ఇప్పటికీ నగదు కొరత అనివార్యంగా ఉందంటే మోడీ ఎంత పెద్ద తప్పు ఎంత విచక్షణ లేకుండా చేశారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.2016లో పెద్ద నోట్లు రద్దు చేసి జనాలకు తొలి షాక్ ఇచ్చిన ప్రధాని ఆ తర్వాత రెండేళ్లకు 2018లో జీఎస్టీ అమలు చేసి మరో షాక్ ఇచ్చారు. ఈ దెబ్బకు చిరు వ్యాపారస్థులు దుఖాణాలు ఎత్తివేశారు. చాలా మంది ప్రజలు - వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. వేల చిన్నతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. ఇప్పటికీ జీఎస్టీ గురించి ఎవ్వరికీ అవగాహన లేకపోవడం మోడీ తెచ్చిన పథకం వైఫల్యాన్ని తేటతెల్లం చేస్తోంది.

ప్రజలపై పెను భారం మోపుతున్న జీఎస్టీని మరిచిపోక ముందే ఎన్నికల వేళ మోడీ మరో బాంబు పేల్చారు. అదే అగ్రవర్ణాలకు 10శాతం రిజర్వేషన్ బిల్లు. దీని వెనుక పెద్ద పొలిటికల్ గేమ్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేవలం ఎన్నికల ముందు ఓట్లు దండుకునే ఎత్తుగడగానే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

అగ్రవర్ణాలకు 10శాతం రిజర్వేషన్ బిల్లు లోక్ సభ - రాజ్యసభల్లో ఆమోదం పొందడంతో రాష్ట్రపతి వద్దకు వెళ్లింది. చట్టంగా మారనుంది. అయితే 50శాతానికి మించి రిజర్వేషన్లు చెల్లవన్న సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ చట్టం న్యాయపరంగా చెల్లదని న్యాయనిపుణులు చెబుతున్నారు.. ఎన్నికల ముందు హడావుడి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించడం లేదు. మోడీకి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువే అని విశ్లేషకులు చెబుతున్నారు. మరో ఈ నిర్ణయాలు సరైనవా కాావా అన్నది... రెండు నెలల్లో జరిగే ఎన్నికల తర్వాత మోడీ భవితవ్యం తేలనుంది.