Begin typing your search above and press return to search.

కేంద్రమంత్రిని పట్టుకుని వేస్టనేసిన రేణుకా చౌదరి

By:  Tupaki Desk   |   23 July 2016 7:34 AM GMT
కేంద్రమంత్రిని పట్టుకుని వేస్టనేసిన రేణుకా చౌదరి
X
పార్లమెంటులో అన్ పార్లమెంటరీ మాటలు ఎక్కువవుతున్నాయి. మొన్నటికి మొన్న బీఎస్పీ అధినేత - యూపీ మాజీ సీఎం మాయావతిపై బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేయగా తాజాగా బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ పై కాంగ్రెస్ కు చెందిన మాజీ కేంద్ర మంత్రులు ఇద్దరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెను శుద్ధ వేస్టంటూ దూషించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లుపై నిన్న రాజ్యసభలో ఓటింగు జరగకపోవడానికి బీజేపీయే కారణమంటూ.. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఈ బిల్లుపై ఓటింగ్ ను అడ్డుకుని సభను అర్థాంతరంగా వాయిదా వేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొనగా - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రేణుకా చౌదరి - జైరాం రమేశ్ లు తమ నోళ్లకు పనిచెప్పారు. అకాలీదళ మహిళా ఎంపీ - కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ పై వారిద్దరూ విరుచుకుపడ్డారు. తమకు సమీపంలో ఉన్న కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ ను టార్గెట్ చేసి ఆమెపై మండిపడ్డారు. హర్ సిమ్రత్ ను వారిద్దరూ కచ్రా(చెత్త - వేస్టు) అని సంబోధించారు. దీంతో ఈ వ్యాఖ్యలకు నొచ్చుకున్న హర్ సిమ్రత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అయినా రేణుకా చౌదరి మాత్రం పదేపదే అదే మాట అన్నారు. దీంతో హర్ సిమ్రత్.. రేణుక - జైరాంపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేస్తానని ప్రకటించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మన్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వల్ల పార్లమెంటు భద్రతకు ముప్పు ఉంటుందన్న అంశంపై తాను మాట్లాడబోతుండగా జైరాం రమేష్ - రేణుకా చౌదరి ఇద్దరూ అడ్డుపడ్డారని.. వేస్టు అని తనని అన్నారని హర్ సిమ్రత్ ఆరోపించారు. వాళ్లిద్దరూ చాలా మొరటుగా ప్రవర్తించారని.. రాజ్యసభలో సభ్యత్వం లేకుండా ఇక్కడికెందుకు వచ్చావు అంటూ తనను ప్రశ్నించారని ఆమె అన్నారు. వాస్తవానికి హర్ సిమ్రత్ రాజ్యసభ సభ్యురాలు కారు - లోక్ సభ సభ్యురాలు. కానీ.. మంత్రి హోదాలో ఆమె రెండు సభల్లోనూ మాట్లాడొచ్చు. కానీ.. సీనియర్ లీడర్లయిన రేణుక - జైరాంలు ఈ విషయం తెలిసి కూడా ఆమెను అలా ప్రశ్నించారంటే వారు ఉద్దేశపూర్వకంగానే ఆమెను టీజ్ చేశారన్న వాదన వినిపిస్తోంది.

కాగా రేణుకా చౌదరి ఎప్పటిలాగే ఈ ఆరోపణలనూ ఖండించారు. హర్ సిమ్రత్ ది రాజకీయ డ్రామా అని కొట్టిపారేశారు. ‘‘అసలు నేను హిందీలోనే మాట్లాడలేదు.. ఇంగ్లీష్ లోనే మాట్లాడాను. అలాంటప్పుడు ఆమెకు కచ్రా అన్న పదం ఎలా వినిపించిందో అర్థం కావడం లేదు. ఆమెకు వినికిడి లోపం అయినా ఉండాలి లేదా ఇంగ్లీషు అయినా రాకపోవాలి’’ అంటూ మళ్లీ అవమానించేలా వ్యాఖ్యానించారు.