Begin typing your search above and press return to search.

ఒళ్లు మరిచిన ఒవైసీ

By:  Tupaki Desk   |   24 July 2015 9:59 AM GMT
ఒళ్లు మరిచిన ఒవైసీ
X
ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకుబ్ మెమెన్ ఉరిశిక్ష అమలు చేయడానికి తేదీ ఖరారు చేయడంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. యాకుబ్ మెమెన్ ను ఎలా ఉరి తీస్తారని ప్రశ్నించారు. మహారాష్ట్ర గవర్నర్ వద్ద అతని క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్ లో ఉండగానే ఉరి తీత గురించి తేదీలు ప్రకటించడం ఎంత వరకూ సమంజసమని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నిస్తున్నారు. మెమెన్ ను ఉరితీయడానికి కారణం ఆయన ఒక వర్గానికి చెందిన వ్యక్తి కావడమే కారణమని ఒవైసీ ఆరోపించారు. అయితే.. ఒవైసీ వ్యాఖ్యలు, ఆయన వాదనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే వర్గానికి చెందిన బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ దీనిపై మాట్లాడుతూ... చట్టం దోషిని ఏ మతం వాడని చూడదని ఆయన స్పష్టం చేశార. అంతేకాదు... 1993 ముంబై పేలుళ్లలో హిందువులు, ముస్లింలు కూడా మరణించారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. యాకుబ్ మెమెన్ హిందువులనూ, ముస్లింలనూ కూడా హత్య చేశాడని షానవాజ్ హుస్సేన్ అన్నారు. ఉగ్రవాదానికి మతం ఉండదన్నారు. పాపం చేసిన వాళ్ల విషయంలో హిందువులా, ముస్లింలా అన్నకోణంలో చూడటం తగదని పేర్కొన్నారు.

కాగా ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ నేత సాక్షి మహారాజ్ ఘాటుగా స్పందించారు. ఇండియా చట్టాలను గౌరవించనివారు పాకిస్థాన్ కు వెళ్లిపోవాలని అన్నారు. 93 పేలుళ్లలో మెమొన్ హస్తం ఉందని పాకిస్థాన్ కూడా చెప్పిన తరువాత ఆయన్ను ఉరి తీయొద్దని ఒవైసీ అనడం అత్యంత దారుణమంటూ సాక్షి మహరాజ్ వ్యాఖ్యానించారు. అయితే... ఈ విషయంలోకి కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి కూడ ఎంటరై ఒవైసీకి వంతపాడుతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒవైసీకి వ్యాఖ్యలను ఆమె నేరుగా సమర్థించనప్పటికీ సాక్షి మహారాజ్ ను మాత్రం విమర్శించారు. ఎవరిని పాక్ పంపాలో ఎవరిని వద్దో చెబుతున్న సాక్షి మహారాజ్ ను విదేశాంగలో కూర్చోబెట్టాలని ఆమె ఎద్దేవాచేశారు. దీంతో ఆమె ఒవైసీనే సమర్థిస్తున్నట్లుగా అనిపిస్తోంది. దీంతో ఒవైసీతో పాటు రేణుక వ్యాఖ్యలపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.