Begin typing your search above and press return to search.

బ‌రిలోకి రేణుక‌!... టీఆర్ ఎస్‌ కు ఓ సీటు త‌గ్గిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   23 March 2019 5:01 PM GMT
బ‌రిలోకి రేణుక‌!... టీఆర్ ఎస్‌ కు ఓ సీటు త‌గ్గిన‌ట్టేనా?
X
కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌద‌రి తాను అనుకున్న‌ట్టుగానే ఖ‌మ్మం బ‌రిలోకి దిగేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు ద‌క్క‌క‌పోతే... పార్టీ మారేందుకు కూడా సిద్ధ‌మేనంటూ అధిష్ఠానానికి సంకేతాలు పంపిన రేణుక‌... ఎట్ట‌కేల‌కు సీటు ద‌క్కించుకున్నారు. నేటు వివిధ రాష్ట్రాల‌కు సంబంధించిన 35 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ త‌న ఇంకో జాబితాను విడుద‌ల చేసింది. ఈ జాబితాలో ఖ‌మ్మం స్థానం కూడా ఉండ‌గా... ఆ సీటును రేణుక‌కు కేటాయిస్తున్న‌ట్లు ఆ పార్టీ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేసింది. దీంతో రేణుక తాను అనుకున్న‌ట్లుగానే ఖ‌మ్మం టికెట్‌ ను సాధించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లో హైద‌రాబాదు సీటును మ‌జ్లిస్‌ కు వ‌దిలేసినా.. మిగిలిన 16 సీట్ల‌ను కూడా గెలిచి తీరాల్సిందేన‌ని టీఆర్ ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు ప‌దే ప‌దే చెబుతున్న మాట తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయా సీట్ల‌కు బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్న టీఆర్ ఎస్‌... గ‌డ‌చిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న‌కు గ‌ట్టి దెబ్బ కొట్టిన ఖ‌మ్మం జిల్లాకు సంబంధించి ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌లే టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ ఎస్‌ లో చేరిన మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావుకు ఆ పార్టీ ఖమ్మం అభ్య‌ర్థిగా బ‌రిలోకి దింపింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి నామాను ఢీకొట్టే అభ్య‌ర్థి ఎవ‌రూ లేర‌న్న వాద‌న‌లో టీఆర్ ఎస్ ఉన్న‌ట్లుగా ప్ర‌చారం సాగింది. అయితే ఎందుకైనా మంచిది బ‌ల‌మైన అభ్య‌ర్థినే బ‌రిలోకి దించాల‌న్న యోచ‌న‌తో అన్ని కోణాల్లో ఆలోచించిన మీద‌టే నామాను బ‌రిలోకి దించింది.

అయితే టీఆర్ ఎస్ వ్యూహానికి చెక్ పెడుతూ కాంగ్రెస్ పార్టీ ఖ‌మ్మం స్థానం నుంచి రేణుక‌ను బ‌రిలోకి దించి గ‌ట్టి షాకే ఇచ్చింద‌ని చెప్పాలి. ఇప్ప‌టికే చేవెళ్ల స్థానం నుంచి అక్క‌డి సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి టీఆర్ ఎస్ కు గుబులు రేపుతుండ‌గా.. ఇప్పుడు కొత్త‌గా ఖ‌మ్మంలో రేణుక కూడా గులాబీ పార్టీలో గుబులు రేపుతున్నార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. రేణుక‌ను కాంగ్రెస్ పార్టీ బ‌రిలోకి దించిన నేప‌థ్యంలో ఇటు టీఆర్ ఎస్ కే కాకుండా త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు మంచి పునాది వేసుకోవాల‌ని ఏకంగా టీడీపీకే రాజీనామా చేసి వ‌చ్చిన నామాకు కూడా కాంగ్రెస్ పార్టీ గ‌ట్టి షాక్ ఇచ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.