Begin typing your search above and press return to search.

జియో ఎఫెక్ట్‌...రూల్స్ మార్చేస్తున్న ట్రాయ్‌

By:  Tupaki Desk   |   27 April 2017 12:20 PM GMT
జియో ఎఫెక్ట్‌...రూల్స్ మార్చేస్తున్న ట్రాయ్‌
X
కాల్స్‌ - డాటా - ఎస్ ఎంఎస్‌ - రోమింగ్‌...ఇలా ఆల్ ఫ్రీ అంటూ టెలికాం ఇండ‌స్ట్రీని ఓ కుదుపు కుదిపేసిన రిల‌యెన్స్ జియో దెబ్బ‌కు ట్రాయ్ దిమ్మ‌దిరిగింది. త‌మ సేవ‌ల టెస్టింగ్ పేరుతో అన్నీ ఫ్రీగా ఇవ్వ‌డంతో ఇత‌ర టెలికాం కంపెనీలు జియోపై గుర్రుగా ఉన్నాయి. ట్రాయ్‌ కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేయ‌డంతో ఆ సంస్థ త‌ల‌ప‌ట్టుకుంది. ఇక లాభం లేద‌నుకొని త‌మ నిబంధ‌న‌ల‌నే మార్చే ప‌నిలో ప‌డిందిప్పుడు. కొత్త‌గా వ‌చ్చే మొబైల్ ఆప‌రేటర్ల‌కు కొత్త నిబంధ‌న‌ల‌ను రూపొందించ‌నుంది. దీనికి సంబంధించి మేలోపు సంప్ర‌దింపుల ప్ర‌క్రియ చేపట్టాల‌ని ట్రాయ్ భావిస్తున్న‌ది.

కొత్త‌గా వ‌చ్చే మొబైల్ ఆప‌రేటర్లు త‌మ సిగ్న‌ల్‌ ను ప‌రీక్షించే స‌మ‌యంలో స‌ద‌రు ఆప‌రేట‌ర్‌ కు గ‌రిష్ఠంగా ఎంత మంది స‌బ్‌ స్క్రైబ‌ర్లు ఉండాలి.. ఎంత‌కాలం ప‌రీక్షించాలి అన్న‌వాటిపై నిబంధ‌న‌ల‌ను మార్చనుంది. ఈ సేవ‌ల‌ను కూడా ఉచితంగా ఇవ్వాలా వ‌ద్దా అన్న‌దానిపై కూడా ట్రాయ్ చ‌ర్చించ‌నుంది. మేలోపు ఈ సంప్ర‌దింపుల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ ట్రాయ్ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ట్ర‌య‌ల్ పేరుతో అన్నీ ఫ్రీగా ఇస్తూ త‌మ క‌స్ట‌మ‌ర్ల‌ను జియో తీసుకెళ్తున్న‌ద‌ని మిగ‌తా ఆప‌రేట‌ర్లు ఆరోపించిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు ఇంట‌ర్‌ క‌నెక్ష‌న్ విష‌యంలో ఎయిర్‌ టెల్‌ - వొడాఫోన్ త‌మ‌కు స‌హ‌కరించ‌డం లేద‌ని జియో ప్ర‌త్యారోప‌ణ‌లు చేసింది. గ‌త సెప్టెంబ‌ర్‌ లోనే త‌మ క‌మ‌ర్షియ‌ల్ ఆప‌రేష‌న్స్ మొద‌లుపెట్టినా.. జియో మాత్రం మ‌రో ఆరు నెల‌ల పాటు ఆల్ ఫ్రీ ఆఫ‌ర్‌ ను కొన‌సాగించ‌డంపై ట్రాయ్‌ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/