Begin typing your search above and press return to search.

జియో ఫ్రీ కాదు కానీ.. ఊరించేవి చాలా చెప్పారు

By:  Tupaki Desk   |   21 Feb 2017 2:15 PM GMT
జియో ఫ్రీ కాదు కానీ.. ఊరించేవి చాలా చెప్పారు
X
రెండు అక్షరాల జియో పేరు సిటీ కుర్రాడికే కాదు.. ఊళ్లో ఉన్నోళ్లకు కూడా సుపరిచితం. జియో సిమ్ వేసుకొని.. మొబైల్ లో సినిమాలు.. పాటలు.. క్రికెట్ మ్యాచ్ లు ఇలా.. ఒకటేంటి? మొబైల్ డేటాను ఎంతలా ఖర్చు పెట్టాలో అంతలా ఖర్చు పెట్టే అలవాటు చేసేసింది జియో. మామూలుగా అయితే.. డేటా అంటే చాలు.. బ్యాంకులో డబ్బుల్నిదాచుకున్నంత భద్రతగా దాచుకుంటూ.. ఆచితూచి ఖర్చు చేసే వైనానికి చెక్ చెప్పి.. ఇష్టారాజ్యంగా.. వాడుకున్నోడికి వాడుకున్నంత అన్న రీతిలో ఊరించేసింది జియో.

జియో ఫ్రీ ఆఫర్ మార్చి 1 తేదీతో ముగియనున్న నేపథ్యంలో రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ప్రెస్ మీట్ పెట్టేసి.. జియో విషయం మీద మాట్లాడారు. మార్చి ఒకటో తేదీ నుంచి ఉచితం కాదని చెప్పినా.. ఊరించే చాలానే ఆఫర్లు చెప్పేసి.. జియోను వదిలి ఉండలేరన్న విషయాన్ని తేల్చేయటమే కాదు.. ఇంకా.. జియోకు సింక్ కాని వాళ్లను సైతం వదిలేది లేదన్న మాటను చెప్పేశారు.

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జియో టారిఫ్ ప్లాన్లు ప్రారంభిస్తామని చెప్పిన ఆయన.. అన్ని వాయిస్ కాల్స్ ఉచితమని.. నో రోమింగ్ చార్జెస్.. నో హిడెన్ ఛార్జెస్ అని చెప్పటమే కాదు.. మిగిలిన వారితో పోలిస్తే.. 20 శాతం ఎక్కువ డేటా ఇస్తామంటూ మరో పోటీకి తెర తీశారు. ఇదే సమయంలో సరికొత్త ఆఫర్ ఒకటి ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఏ నెట్ వర్క్ కు అయినా ఉచిత కాలింగ్ సేవల్నికొనసాగిస్తామని చెప్పిన ఆయన.. ఎలాంటి రోమింగ్ ఛార్జీలు ఉండవని.. బ్లాక్ అవుట్ డేస్ ఉండవని చెప్పారు. అందుబాటు ధరల్లో అత్యుత్తమ సేవల్ని అందిస్తామని చెప్పిన అంబానీ.. కొత్త జియో వినియోగదారుల కోసం సరికొత్త పథకాన్ని ప్రకటించారు.

జియో ప్రైమ్ తో ఉండే ఈ ప్రత్యేకమైన ప్లాన్ లో రూ.99లకు సిమ్ తీసుకుంటే.. అన్ లిమిటెడ్ సేవల్ని అందిస్తామని.. ఇందుకోసం మార్చి 1 నుంచి మార్చి 31 వరకూ మెంబర్ షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లుగా పేర్కొన్నారు. ఇక.. జియో ప్రధాన సభ్యులుగా చేరేవారు రోజుకు కేవలం రూ.10 (నెలకు రూ.303) చెల్లిస్తే.. అన్ని సేవల్ని పొందే వీలుందని చెప్పారు.

జియో ప్రయాణం ప్రారంభమైన నాటి నుంచి.. అదెన్ని సంచలనాలు సృష్టించిందన్న విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. జియో రాక ముందు మొబైల్ డేటా వినియోగంలో ప్రపంచంలో భారతదేశం 150వ స్థానంలో ఉండేది. జియో ఎంట్రీతో ప్రపంచంలోనే భారత్ మొదటిస్థానానికి చేరుకుందన్నారు. కేవలం 170రోజుల్లో 10 కోట్ల మంది వినియోగదారుల్ని జియోలోకి చేర్చుకున్నామని చెబుతూ.. ఈ పదికోట్ల మంది కంపెనీకి ప్రధాన ప్రచారకర్తలుగా ఆయన అభివర్ణించారు. 2019 నాటికి దేశంలో 99 శాతం మందికి జియో ఉంటుందని చెప్పిన అంబానీ.. జియో ఎంట్రీ ఇచ్చిన మొదటి వంద రోజుల్లో సెకనుకు ఏడుగురు సభ్యుల చొప్పున చేరినట్లుగా చెప్పారు. టెలికంరంగంలో ఇదో సంచలనంగా చెప్పిన ఆయన.. జియో నెట్ వర్క్ కు సంబంధించిన మరిన్ని ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.

రోజుకు 5.5 కోట్ల నిడివి ఉన్న వీడియోల్ని చూస్తున్నారని.. భవిష్యత్తులో జియో సేవల్ని మరింత మెరుగ్గా ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో మరే ఇతర నెట్ వర్క్ సంస్థల కంటే కూడా రెట్టింపు టవర్లు జియోకు ఉన్నట్లుగా చెప్పిన ముఖేశ్ అంబానీ.. డేటా వినియోగంలోనే ప్రపంచంలోనే భారతీయులు ముందున్నారన్నారు. కేవలం జనవరిలో జియో వినియోగదారులు 100 కోట్ల జీబీ డేటాను వినియోగించినట్లుగా చెప్పారు. తమ నెట్ వర్క్ ద్వారా రోజు 5.5 కోట్ల గంటల వీడియోల్ని అందిస్తున్నట్లుగా చెప్పారు. డిజిటల్ లైఫ్ కి డేటా అన్నది ఆక్సిజన్ లాంటిదని చెప్పిన ఆయన.. మిగిలిన డేటా ప్లాన్లతో పోలిస్తే.. వాటి కంటే 20 శాతం అధికంగా డేటా ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

జియో డౌన్ లోడ్ స్పీడ్ గురించి చెబుతూ...జియోనెట్ వర్క్ సగటు డౌన్ లోడ్ స్పీడ్ 18.16 ఎంబీపీఎస్ ను తాకినట్లుగా వెల్లడించారు. వాణిజ్య 4జీ సర్వీస్లులో ఇదే అత్యధిక వేగమని ట్రాయ్ డేటా చెప్పినట్లుగా వెల్లడించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/