Begin typing your search above and press return to search.

రెడ్డిలదే హ‌వా...తెలంగాణ అసెంబ్లీ చిత్రం

By:  Tupaki Desk   |   12 Dec 2018 4:51 AM GMT
రెడ్డిలదే హ‌వా...తెలంగాణ అసెంబ్లీ చిత్రం
X
తెలంగాణ అసెంబ్లీలో మునుపెన్న‌డూ లేని ప్ర‌త్యేక ఘ‌ట్టం చోటుచేసుకుంది. తెలంగాణ‌లో బ‌ల‌మైన సామాజికవ‌ర్గంగా పేరున్న రెడ్డిల‌కు విశేష ప్రాధాన్యం ద‌క్కింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గం నుంచి అత్యధికంగా మొత్తం 40 మంది అభ్యర్థులు ఎన్నికయ్యారు. వీరిలో టీఆర్ ఎస్ నుంచి 31 మంది.. కాంగ్రెస్ నుంచి తొమ్మిదిమంది విజయం సాధించారు. త‌ద్వారా రెడ్డిల పార్టీ అనే ముద్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే - వ్యూహాత్మ‌కంగా టికెట్లు ఎక్కువ‌గా ఇచ్చి వారిని గెలిపించుకోవ‌డం ద్వారా టీఆర్ ఎస్ రెడ్డిల‌కు అధిక ప్రాధాన్యం సొంతం చేసుకుంది.

ఆయా కులాల వారీగా ద‌క్కిన సీట్ల గురించి చూస్తే...రాష్ట్ర అసెంబ్లీకి బీసీలు 22 మంది - ఎస్సీలు 19 మంది - ఎస్టీలు 12 మంది - వెలమలు 10 మంది - ముస్లింలు ఎనిమిది మంది - కమ్మ ఐదుగురు - బ్రాహ్మణులు ఇద్దరు - వైశ్య సామాజికవర్గం నుంచి ఒకరు చొప్పున ఎన్నికయ్యారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వారిలో టీఆర్ ఎస్ నుంచి 18 మంది విజయం సాధించగా - కాంగ్రెస్ నుంచి ఇద్దరు గెలుపొందారు. టీఆర్ ఎస్ నుంచి యాదవ సామాజికవర్గానికి చెందిన ఐదుగురు - గౌడ్‌ ల నుంచి నలుగురు - మున్నూరు కాపుల నుంచి ఆరుగురు ఎన్నికయ్యారు. వెలమ సామాజికవర్గంలో టీఆర్ ఎస్ 12 మందికి టికెట్లు ఇవ్వగా పదిమంది గెలిచారు. కాంగ్రెస్ నలుగురు వెలమలకు టికెట్లు ఇస్తే నలుగురూ ఓటమిపాలయ్యారు. టీఆర్ ఎస్ నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన ఆరుగురికి టికెట్లు ఇస్తే ఐదుగురు గెలుపొందారు. టీడీపీ ముగ్గురికి టికెట్లు ఇస్తే ముగ్గురూ ఓడిపోయారు.

టీఆర్ ఎస్ నుంచి 15 మంది ఎస్సీలు (వీరిలో తొమ్మిదిమంది మాదిగ - ఆరుగురు మాల) విజయం సాధించారు. ఎస్టీలలో టీఆర్ ఎస్ నుంచి ఆరుగురు విజయం సాధించారు. వీరిలో లంబాడాలకు చెందిన ఐదుగురు - ఆదివాసీల నుంచి ఒకరు గెలుపొందారు. ముస్లిం సామాజికవర్గానికి చెందినవారిలో టీఆర్ ఎస్ ముగ్గురికి - కాంగ్రెస్ ఏడుగురికి టికెట్లు ఇవ్వగా.. టీఆర్ ఎస్ నుంచి ఒక్కరు గెలుపొందారు. కాగా, అత్య‌ధికంగా రెడ్డిల‌ ప్రాతినిధ్యంతో తెలంగాణ అసెంబ్లీలో ఈ ద‌ఫా ప్ర‌త్యేకత‌ను సొంతం చేసుకుంది.