చింతమనేనికి తెలుగు తమ్ముడి వార్నింగ్

Wed Jan 11 2017 11:54:55 GMT+0530 (IST)

తన మాటలు.. చేతలతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. ఏపీ అధికారపక్షానికి తలనొప్పిగా మారారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. పదేళ్ల విరామం తర్వాత చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఏదైనా ఎమ్మెల్యే తీరు కారణంగా రాష్ట్రస్థాయిలోచర్చ.. ఆందోళనలు.. నిరసనలు చోటు చేసుకున్నాయంటే అది చింతమనేని  పుణ్యమేనని చెప్పాలి.

అధికారుల మీద దురుసు ప్రవర్తన.. మీడియా పట్ల అనుచిత వైఖరితో పాటు.. ఇష్టారాజ్యంగా మాట్లాడటం.. బాధ్యతగా ఉండటం తనకేమాత్రం సాధ్యం కాదన్నట్లుగా ఉండే ఆయన మాటలు.. చేతలు తరచూ ఏదో ఒక వివాదానికి కారణం అవుతుంటాయి. తాజాగా అలాంటిదే మరొకటి తెర మీదకు వచ్చింది. ఏలూరు మండల పరిషత్ అధ్యక్ష పదవిని కొల్లేరు గ్రామాలకు కట్టబెట్టేందుకు చింతమనేని రూ.40లక్షలు దండుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

దీనిపై రోజురోజుకీ రచ్చ మరింత ముదరటమే కాదు.. చివరకు తెలుగుదేశం పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘చింతమనేని ప్రభాకర్.. పిచ్చి వేషాలు మానుకో. సామాన్య ప్రజలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అంతేకాదు.. . అధికారులతో వ్యవహరించిన రీతిలో ఇష్టానుసారంగా పార్టీ నేతల్నితిట్టేస్తే ఊరుకోం’’ అంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చేయటం గమనార్హం.

2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా డబ్బులు మారాయని.. అందుకు ప్రతిఫలంగా రెడ్డి అనురాధను ఏంపీపీ పదవి నుంచి తప్పించి కొల్లేరు గ్రామానికి చెందిన ఎంపీటీసీకి ఆ పదవిని కట్టబెట్టేందుకు చింతమని కుతంత్రాలు చేస్తున్నట్లు దుయ్యబట్టారు. ఇప్పటివరకూ చింతమనేని విపక్షాలే టార్గెట్ చేసేవి. ఇప్పుడు స్వపక్షానికి చెందిన నేత ఓపెన్ గా ఫైర్ అవుతుండటం గమనార్హం. ఇలాంటివి దీర్ఘకాలం సాగితే చింతమనేనికే కాదు.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశానికి దెబ్బ పడటం ఖాయమన్న  మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/