Begin typing your search above and press return to search.

దేశంలో తొమ్మిది మందికే ఎర్రబుగ్గలు..?

By:  Tupaki Desk   |   4 Sep 2015 5:19 AM GMT
దేశంలో తొమ్మిది మందికే ఎర్రబుగ్గలు..?
X
కూసింత వీవీఐపీ అయితే చాలు.. వాహనం మీద ఎర్రబుగ్గలు పెట్టేసుకొని.. హారన్ కొట్టుకుంటూ రోడ్ల మీద హడావుడి చేయటం మన దేశంలో మామూలే. ఎర్రబుగ్గలు పెట్టుకునే సౌకర్యం.. క్యాబినెట్ ర్యాంకు ఉన్న ప్రతిఒక్కరికి సౌలభ్యం ఉంది.

అయితే.. ఈ ఎర్రబుగ్గల సౌకర్యం మీద వస్తున్న విమర్శలు.. సూచనలకు స్పందించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఒక ప్రతిపాదన చేస్తున్నారు. ఆయన చేస్తున్న ప్రతిపాదన పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆయన ప్రతిపాదన ఏమిటంటే.. దేశ వ్యాప్తంగా కేవలం తొమ్మిది మంది వీవీఐపీలకు మాత్రమే ఎర్రబుగ్గ సౌకర్యం ఇవ్వాలని.

కేంద్రంలో ఐదుగురు వీవీఐపీలకు.. రాష్ట్రాలలో నలుగురు వీవీఐపీలకు మాత్రమే ఎర్రబుగ్గ వాడే సౌకర్యం ఉంటుంది. మిగిలిన వారంతా కూడా సామాన్యుల మాదిరే.. వాహనాల మీద ఎలాంటి బుగ్గలను పెట్టుకునే అవకాశం లేదు. గడ్కరీ తెరపైకి తెచ్చిన వాదనకు పలువురు కేంద్రమంత్రులు మద్ధతు పలుకుతున్నారు. ఇక.. ఎర్రబుగ్గలు పెట్టుకునే అవకాశం ఉన్న వీవీఐపీలు కేంద్రంలో.. రాష్ట్రపతి.. ఉప రాష్ట్రపతి.. ప్రధానమంత్రి.. లోక్ సభ స్పీకర్.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లు మాత్రమే ఉంటారు.

అదే విధంగా రాష్ట్రాల్లో.. గవర్నర్.. ముఖ్యమంత్రి.. అసెంబ్లీ స్పీకర్.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మాత్రమే ఎర్రబుగ్గలు వినియోగించే వీలుంటుంది. మరి.. గడ్కరీ చేస్తున్న తాజా ప్రతిపాదన చట్టరూపం దాలుస్తుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒకవేళ ఓకే కానీ.. అయితే.. వీవీఐపీ కల్చర్ బంధనాల నుంచి కొంత విముక్తి లభించినట్లే.