Begin typing your search above and press return to search.

రేణుకా చౌదరి భూముల్లో పేదోళ్ల జెండాలు

By:  Tupaki Desk   |   28 Nov 2015 6:07 AM GMT
రేణుకా చౌదరి భూముల్లో పేదోళ్ల జెండాలు
X
కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి భూముల్లో సీపీఎం ఆధ్వర్యంలో ఎర్ర జెండాలు పాతారు. ఖమ్మం జిల్లా పాల్వంచలోని బిసిఎం రోడ్డు స్టీల్ ప్లాంట్ వద్ద రేణుకా చౌదరికి భూములున్నాయి. ఆ భూముల్లో సిపిఎం ఆధ్వర్యంలో పేదలు ఎర్రజెండాలు పాతారు. వాటితోపాటు సమీపంలోని చెరువు బంజరు - మేడికుంట చెరువు భూముల్లో కూడా ఎర్రజెండాలు పాతారు.

రేణుకా చౌదరి మూడు దశాబ్దాల క్రితం ఆక్సికో కర్మాగారం స్థాపించి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం నుంచి 43 ఎకరాల భూమి తీసుకున్నారని, ఇప్పటి వరకు కర్మాగారం స్థాపించలేదని, పైగా ఆ భూముల్లో మామిడితోటలు వేశారని సిపిఎం ఆరోపిస్తోంది. కర్మాగారం స్థాపిస్తామని చెప్పి 30 సంవత్సరాలైనా కనీసం పునాది రాయి కూడా వేయలేదని... అందులో పండ్ల తోటలు వేసుకుని హాయిగా అనుభవిస్తున్నారని... ప్రభుత్వాలు మారినా ఆమె ఆ భూమిని విడిచిపెట్టలేదని... కర్మాగారం ఏర్పాటు పేరుతో తీసుకుని సొంతం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ఆ భూములను పేదలకు ఇవ్వాలని డిమాండు చేస్తూ ఎర్రజెండాలు పాతారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు వచ్చి ఆక్రమణలను అడ్డుకున్నారు. కోడ్ అమలులో ఉన్నందున ఆక్రమణలకు దిగవద్దని సూచించారు.

విషయం కలెక్టరు కార్యాలయానికి చేరడంతో భూములను సర్వే చేసి కబ్జాదారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. చాలాకాలంగా ఖమ్మం జిల్లా కాంగ్రెసు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న రేణుకకు కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద మంచి పట్టుంది. సోనియా - రాహుల్ గాంధీల వద్ద కూడా ఆమె మాట చెల్లుబాటు చేసుకోగలరని చెబుతుంటారు. తనకున్న పలుకుబడులతోనే ఆమె కర్మాగారం పేరుతో భూములు కబ్జా చేశారని వామపక్ష నేతలు ఆరోపిస్తుండగా .. ఆమె మాత్రం తన భూముల్లోనే జెండాలు పాతుతారా అంటూ రగిలిపోతున్నారట.