Begin typing your search above and press return to search.

2016.. మంట పుట్టించటం ఖాయమంట

By:  Tupaki Desk   |   26 Nov 2015 4:17 AM GMT
2016.. మంట పుట్టించటం ఖాయమంట
X
భారీ ఉష్ణోగ్రతలు నమోదై.. దేశ ప్రజలకు సినిమా చూపించిన 2015 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. హాట్.. హాట్ గా సాగిన 2015ను దేశ ప్రజలు అంత త్వరగా మర్చిపోలేరు. వర్షాలు సరిగా లేక.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటూ సాగిన ఈ ఏడాది ఎక్కువ మందికి చేదు గురుతుల్నే మిగిల్చింది. మిగిలిన కాలాలతో పోలిస్తే.. 2015 వేసవిని ఎవరూ మర్చిపోలేరు. విపరీతమైన ఉక్కపోతతో.. వేడితో ఉక్కిరిబిక్కిరి కావటమే కాదు.. ఏప్రిల్.. మే.. జూన్ నెలలు అందరికి ప్రత్యక్ష నరకాన్నే చూపించాయి.

భారీగా నమోదైన ఉష్ణోగ్రతల కారణంగా పెద్ద ఎత్తున మృత్యువాత పడిన పరిస్థితి. 2015లో ఎదురైన ఈ వేడి తిప్పలు.. 2016లో ఉండవనే అనుకున్న వారికి 2016లోనూ ఇలాంటి తిప్పలే తప్పవని చెబుతున్నా వాతావరణ నిపుణులు. ఎలినినో ప్రభావంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన విధంగానే.. 2016లోనూ ఇలాంటి పరిస్థితే తప్పదని తేల్చి చెబుతున్నారు.

పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు.. పశ్చిమాన ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా 2015లో ఎలినినో ఏర్పడింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. దీని కారణంగానే పగటి ఉష్ణోగ్రత ప్రపంచ వ్యాప్తంగా ఒక డిగ్రీ సెల్సియస్ అదనంగా పెరిగిన పరిస్థితి. దాదాపు ఇలాంటి పరిస్థితే వచ్చే ఏడాది ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే.. రానున్న 2016 గురించి ఇప్పటి నుంచే హడలిపోవాల్సిందేనా..?