తుపాకీ ప్రత్యేకం: నలుగురు సుప్రీం జడ్జిలు రాసిన లేఖ పూర్తి పాఠం

Fri Jan 12 2018 23:00:01 GMT+0530 (IST)

భారతదేశ న్యాయ చరిత్రలోనే తొలిసారి సర్వోన్నత న్యాయస్థానానికి చెందిన నలుగురు న్యాయమూర్తులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై విమర్శలు చేశారు. ఆయనకు ఏడు పేజీల లేఖ రాశారు. సంచలనం సృష్టించిన ఈ లేఖ యథాతథంగా ‘తుపాకీ’ పాఠకుల కోసం...
----------
డియర్ చీఫ్ జస్టిస్మేం అత్యంత ఆవేదనతో - బాధతో ఈ లేఖను రాస్తున్నాం. సర్వోన్నతమైన ఈ న్యాయస్థానం జారీ చేసిన కొన్ని న్యాయబద్ధమైన ఆదేశాలు గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయ పాలనా నిర్వహణ తీరుపై మాత్రమే కాకుండా ఏకంగా న్యాయవ్యవస్థ పనితీరుపైన - హైకోర్టుల స్వతంత్రత పైనా ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ఆందోళనే ఈ లేఖ రాయడానికి కారణం. అందుకే దీన్ని మీకు రాయడమే సమంజసంగా భావించి రాస్తున్నాం.

దేశంలో కలకత్తా - బాంబే - మద్రాస్ ఛార్టర్డ్ హైకోర్టులు ఏర్పాటైన నాటి నుంచి  మన న్యాయపాలనలో కొన్ని సంప్రదాయాలు ఏర్పడ్డాయి. ఆ మూడు ఛార్టర్డ్ హైకోర్టులు ఏర్పడిన వందేళ్ల తరువాత నెలకొల్పిన ఈ కోర్టు కూడా అదే సంప్రదాయాలను స్వీకరించి పాటిస్తోంది.  ఇలాంటి సంప్రదాయాల మూలాలు ఆంగ్లో-సాక్సన్ న్యాయవ్యవస్థ లో ఉన్నాయి.
    
సుప్రీంకోర్టులో బాగా పాతుకుపోయిన నియమాల ప్రకారం రోస్టర్ విషయంలో చీఫ్ జస్టిస్ నిర్ణయాధికారి.. కోర్టు వ్యవహారాలు సజావుగా సాగడానికి - ఈ కోర్టులోని సభ్యులు - ధర్మాసనం ఎలాంటి కేసులను విచారించాలి - లేదంటే కేసులను ఎలా వర్గీకరించాలి అనేది నిర్ణయించేది ఆయనే. చీఫ్ జస్టిస్ కున్న ఈ అధికారాన్ని గుర్తించే సంప్రదాయం కేవలం క్రమశిక్షణ కోసం - కోర్టు వ్యవహారాలు సజావుగా సాగేందుకు రూపొందించినదే కానీ ఎవరి ఆధిపత్యాన్ని సూచించేది కాదు. అది చీఫ్ జస్టిస్ కు తన సహచరులపై చట్టబద్ధమైన లేదా వాస్తవమైన ఆధిపత్యాన్ని ఇవ్వదు. సర్వోన్నత న్యాయస్థానంలోని సమానుల్లో చీఫ్ జస్టిస్ ప్రధముడు మాత్రమే. ఒక ప్రత్యేకమైన కేసు లేదా ఆ కేసు ఎలాంటిది అన్నదాన్ని బట్టి దాని విచారణకు ధర్మాసనంలో ఎందరుండాలి - ఎవరెవరు ఆ ధర్మాసనంలో ఉండాలన్నది రోస్టర్‌ను నిర్ణయించడంలో చీఫ్ జస్టిస్ కు మార్గదర్శకం చేసేందుకూ నిబంధనలు చాలాకాలంగా ఉన్నాయి. పైన పేర్కొన్న సంప్రదాయానికి అనుగుణంగా - ఈ కోర్టు సహా బహుళ సభ్యులున్న ఏ న్యాయవిభాగమైనా - రోస్టర్ ప్రకారం ఆయా ధర్మసనాలు మాత్రమే విచారించాల్సిన విషయాలపై లేని అధికారాన్ని చలాయిస్తూ - వాటిలో జోక్యం చేసుకునే ప్రయత్నాలకు - వాటిపై వ్యాఖ్యానాలు చేయడానికి దూరంగా ఉండాలి.
    
ఈ నిబంధనలను పాటించకపోతే అది అవాంఛనీయమైన ఫలితాలకు దారితీస్తుంది. అంతేకాదు - న్యాయవ్యవస్థ చిత్తశుద్ధిపైనే సందేహాలు బయలుదేరుతాయి. పైన పేర్కొన్న రెండు నిబంధనలనూ ఇటీవలి కాలంలో కచ్చితంగా పాటించడం లేదు - ఈ విషయం మీకు చెప్పడానికి చింతిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో దేశంలో - న్యాయవ్యవస్థలో తీవ్రమైన పరిణామాలకు దారితీయగల కేసులను కూడా సరైన కారణాలు లేకుండానే ఈ కోర్టు చీఫ్ జస్టిస్ ఇష్టమొచ్చినవారికి కేటాయించడం జరుగుతోంది. ఇది ఎట్టిపరిస్థితుల్లోనూ జరగరాదు. ఇంతకంటే లోతుగా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తే న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ దిగజారుతుందనే ఉద్దేశంతో వాటిని మేం బయటపెట్టడం లేదు. అయితే... ఇప్పటికే ఇలాంటి ఇష్టారీతి వల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ కొంతమేర దెబ్బతింది.
 
27 అక్టోబర్ 2017న ఆర్పీ లూథ్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జారీ చేసిన ఉత్తర్వులపై - విస్తృత ప్రజా ప్రయోజనార్థం మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ ను ఖరారు చేయడంలో ఇక ఎంత మాత్రమూ ఆలస్యం చేయడం మంచిది కాదని మీకు తెలియజేయడం సముచితమని భావిస్తున్నాం. సుప్రీంకోర్టు అడ్వొకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ అండ్ ఎఎన్ ఆర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ((2016) 5 ఎస్‌సీసీ 1) కేసులో మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ ఈ కోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయంపై ఆధారపడినపుడు ఆ అంశాన్ని ఏ ఇతర ధర్మాసనమైనా ఎలా చేపడుతుందో అర్థం చేసుకోవడం కష్టం. ఈ అంశంపై రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం అనంతరం - ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియం (మీతో సహా) చర్చించి.. ఆ మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్‌ను నిర్ణయించి - దానిని నాటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 2017 మార్చిలో భారత ప్రభుత్వానికి పంపడం జరిగింది. భారత ప్రభుత్వం దానికి స్పందించలేదు. దానిని పరిగణనలోకి తీసుకుని - కొలీజియం ఖరారు చేసిన మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ ను.. సుప్రీంకోర్టు అడ్వొకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ (పైన పేర్కొన్న) కేసులోఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా భారత ప్రభుత్వం అంగీకరించినట్లు భావించాల్సి ఉంటుంది. అందువల్ల బెంచ్ మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ ను ఖరారు చేసే విషయంలో ఎలాంటి వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం కానీ సమస్య సుదీర్ఘకాలం అలాగే కొనసాగాల్సిన అవసరం కానీ లేదు.
    
జులై 4 2017న ఈ కోర్టుకు చెందిన ఏడుగురు సభ్యుల ధర్మాసం జస్టిస్ సీఎస్ కర్ణన్ కేసును ((2017) 1 ఎస్‌సీసీ) నిర్ణయించింది. ఆ నిర్ణయంలో (ఆర్పీ లూథ్రా కేసులో పేర్కొన్న) మనలో ఇద్దరు - జడ్జీల అపాయింట్ మెంట్ విధానాన్ని పున:సమీక్షించాల్సిన అవసరం ఉందని పదవి నుంచి తొలగించడం కన్నా దిద్దుబాటు చర్యలు తీసుకునే వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఏడుగురు న్యాయమూర్తుల్లో ఒక్కరు కూడా మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్‌పై ఎలాంటి వ్యాఖ్యానమూ చేయలేదు. మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్‌కు సంబంధించిన ఏ విషయంపై అయినా చీఫ్ జస్టిస్ కాన్ఫరెన్స్‌లో పూర్తి కోర్టు సమక్షంలో చర్చ జరగాలి. న్యాయవ్యవస్థ తరపు నుంచి అలాంటి అతి ముఖ్యమైన విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అది రాజ్యాంగ ధర్మాసనం తప్ప మరెవరూ తీసుకోవడానికి వీల్లేదు. పైన పేర్కొన్న పరిణామాలను చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. కొలీజియంలోని ఇతర సభ్యులతో అవసరమైతే ఆ తర్వాత ఈ కోర్టుకు చెందిన ఇతర జడ్జీలతో కూడా చర్చించి ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత చీఫ్ జస్టిస్‌పై ఉంది. 27 అక్టోబర్ 2017న ఆర్పీ లూథ్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జారీ చేసిన ఉత్తర్వులపై ఉత్పన్నమైన సమస్యలను మీరు తగిన పరిష్కారం చూపిస్తే  మేము ఈ కోర్టు జారీ చేసిన ఇతర ఉత్తర్వులను అలాంటి పరిష్కారాల కోసం మీ ముందుకు తేగలం.

విత్ కైండ్ రిగార్డ్స్

జె.చలమేశ్వర్ - రంజన్ గొగోయి - మదన్ బి.లోకూర్ - కురియన్ జోసెఫ్