హైదరాబాద్ లో ఆకస్మిక వర్షాలు...కారణం ఇదట

Thu Oct 12 2017 23:03:20 GMT+0530 (IST)

దాదాపుగా గత పదిహేను రోజులుగా తెలుగు రాష్ర్టాల పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వాసులు ఓ చిత్రమైన అనుభూతి ఎదుర్కుంటున్నారు. ఒకే రోజులో మూడు కాలాలను అనుభవిస్తున్నారు. అంటే...మధ్యాహ్నాం వరకు ఎండ. ఆ తర్వాత అకస్మాత్తుగా దట్టమైన మేఘాలు....సాయంత్రం అవడం ఆలస్యం అన్నట్లుగా తట్టుకోలేని వాన. ఎప్పుడో అర్ధరాత్రికి కానీ తగ్గకపోవడం. ఇది పక్షం రోజులుగా విచిత్రమైన వాతావరణ పరిస్థితి. ఇలాంటి పరిస్థితి హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇంతేకాదు సెంట్రల్ ఇండియాలో మొత్తం ఇదే పరిస్థితి. ఇంతకీ ఈ అకస్మాత్తు మార్పులకు లాజిక్ ఏంటని తేల్చేపనిలో పడ్డారు పరిశోధకులు. అత్యంత ఆసక్తికరంగా ఇందులో రోడ్లు కూడా ఒక కారణమని తేలింది.1950 నుంచి 2015 వరకు హైదరాబాద్ సహా తెలంగాణ ప్రాంతంలో వాతావరణ పరిస్థితి మూడింతలు మారినట్లు తెలుస్తోంది. అరేబియా సముద్రం మీదుగా వస్తున్న తేమ వల్ల ఈ విపరీత వాతావరణ పరిస్థితికి కారణమని పరిశోధకులు అంచనా వేశారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య.. అరేబియా సముద్రం నుంచి వేసవిలో వచ్చే రుతుపవనాల వల్ల.. చాలా ప్రాంతాల్లో వాతావరణం మారినట్లు పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. అరేబియన్ సముద్ర తేమను పెనుగాలులు మోసుకెళ్లుతున్న తీరు వల్ల చాలా ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు పడుతున్నాయని స్పష్టం చేస్తున్నారు.దీని వల్లే మధ్య భారత దేశంలో అక్కడక్కడ వర్షాలు భయపెట్టిస్తున్నాయని విశ్లేషకులు వివరిస్తున్నారు. మహారాష్ట్ర - తెలంగాణతో పాటు ఒడిశా - అస్సాంలోని కొన్ని భాగాల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

పుణెకు చెందిన సెంటర్ ఫర్ క్లైమెట్ ఛేంజ్ రీసర్చ్ - ఇండియన్ ఇన్స్ ట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరాలజీ సంస్థలు ఈ అంచనా వేశాయి. శాస్త్రవేత్త డాక్టర్ రాక్సీ మాథ్యూ కోల్.. వాతావరణ మార్పులపై నివేదికను వెల్లడించారు. అక్టోబర్ నెలలో.. ఈ వాతావరణం వల్ల వర్షాలు పడే ఛాన్సు ఉందని ఆయన వెల్లడించారు. గ్లోబల్ వార్మింగ్ తో పాటు నగరాల్లో భూములను వాడుతున్న తీరు వల్ల కూడా వర్ష బీభత్సం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. ``వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు అంతటా పెరుతున్నాయి. దీంతో ఎక్కువ సమయం.. వాతావరణంలో తేమ ఉండే అవకాశం ఉంది. ఆకాశంలో తేమ ఎక్కువగా ఉంటే. వర్షాలు కూడా అంతే భారీ స్థాయిలో పడే అవకాశాలున్నాయి. ఇక కాంక్రీట్ రోడ్ల వల్ల నగరాల్లో ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది`` అని డాక్టర్ రాక్సీ తెలిపారు.