Begin typing your search above and press return to search.

ప‌రిపూర్ణ‌నందపై న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ వేటు ఎందుకు?

By:  Tupaki Desk   |   11 July 2018 5:31 AM GMT
ప‌రిపూర్ణ‌నందపై న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ వేటు ఎందుకు?
X
శ్రీ‌రాముడిపై సినీ విమ‌ర్శ‌కుడిగా త‌న‌కు తాను చెప్పుకునే క‌త్తి మ‌హేశ్ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే. దీనిపై స్వామి ప‌రిపూర్ణానంద రియాక్ట్ కావ‌టం.. ఆయ‌న తీరుపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ నిర‌స‌న యాత్ర‌ను చేప‌డ‌తాన‌నంటూ ప్ర‌క‌టించ‌టం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా.. యాత్ర‌కు తొలుత అనుమ‌తి ఇచ్చిన హైద‌రాబాద్ పోలీసులు ఆ త‌ర్వాత ప‌రిష్మ‌న్ ను ర‌ద్దు చేశారు. ఆపై హౌస్ అరెస్ట్ చేశారు.

రెండు రోజులుగా హౌస్ అరెస్ట్ లో ఉన్న ఆయ‌న‌పై హైద‌రాబాద్ న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ వేటు వేసిన పోలీసులు.. బుధ‌వారం తెల్ల‌వారుజామున మూడున్న‌ర గంట‌ల ప్రాంతంలో ఆయ‌న నివాస‌మైన జూబ్లీహిల్స్ ఇంటి నుంచి ర‌హ‌స్యంగా త‌ర‌లించారు. ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌కుండా ఆయ‌న్ను న‌గ‌రం వెలుప‌ల‌కు పంపారు. ఈ వ్య‌వ‌హార‌మంతా గుట్టుగా సాగింది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ప‌రిపూర్ణానంద‌ను కాకినాడ వ‌ద్ద తెలంగాణ పోలీసులు వ‌దిలిపెట్టిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. స్వామిపై బ‌హిష్క‌ర‌ణ వేటు ఎందుకు వేసిన‌ట్లు? దానికి దారి తీసిన కార‌ణాలు ఏమిట‌న్న‌ది చూస్తే.. సంఘ వ్య‌తిరేక చ‌ర్య‌ల నివార‌ణ‌లో భాగంగా సెక్ష‌న్ 3 - 1980 యాక్ట్ ప్ర‌కారం న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ వేటును వేసిన‌ట్లుగా పేర్కొన్నారు. త‌మ నివేదిక‌లో స్వామి ప‌రిపూర్ణనంద ఇటీవ‌ల కాలంలో చేసిన కొన్ని వ్యాఖ్య‌ల్ని ఆధారంగా చూపించి తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన స‌మాచారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇందులో పోలీసుల రిపోర్ట్‌కు సంబంధించిన అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి ఇంత‌కీ.. స్వామిపై వేటుకు సంబంధించి పోలీసులు చూపిస్తున్న కార‌ణాల రిపోర్ట్‌ ను చూస్తే..

1 నవంబర్ 2017లో మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ లో జరిగిన రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావ సభలో ప‌రిపూర్ణ‌నంద మాట్లాడుతూ.. ముస్లింలకు - క్రైస్తవులకు మక్కా - జెరూసలెం వెళ్లేందుకు ప్రభుత్వాలు పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని సబ్సిడీలుగా ఇస్తున్నాయని ప్రశ్నించారు. అదే స‌మ‌యంలో హిందువులు తమ పవిత్ర క్షేత్రాలకు వెళ్లాలంటే మాత్రం సర్ ఛార్జీల పేరుతో పన్నులు వసూలు చేస్తున్నారు

2. 2 డిసెంబర్ 2017లో కామారెడ్డి జిల్లాలోని రామేశ్వరపల్లి గ్రామంలోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ స‌మావేశంలో నిజాం పాల‌న కావాలా? ఛ‌త్ర‌ప‌తి శివాజీ పాల‌న కావాలా? అని యువ‌త‌ను అడిగారు. మొఘ‌ల్ పాల‌కులు బాబ‌ర్.. గ‌జ‌నీ మ‌హ్మ‌ద్‌.. ఖిల్జీ.. హుమ‌యున్ లాంటి వారు దేశంలోని హిందువుల‌పై ఎన్నో ఆరాచ‌కాలు చేశారు. అత్యాచారాలు.. లూటీలు చేశారు. ఎంతోమంది హిందువుల‌ను ముస్లిం పాల‌కులు చంపేశారంటూ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు.

అదే స‌మ‌యంలో తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాలు.. పట్టణాల పేర్లను సైతం మార్చాల్సిన అవసరం ఉందన్న స్వామి వ్యాఖ్య‌పైనా పోలీసులు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. స్వామి మార్చాల‌ని ప్ర‌స్తావించిన న‌గ‌రాలు.. ప‌ట్ట‌ణాల్న‌ చూస్తే.. నిజామాబాద్ - హైదరాబాద్ - సికింద్రాబాద్ - ఆదిలాబాద్ - మహబూబ్ నగర్ - నిజామాబాద్ కు పాత‌పేరు అయిన ఇందూరుగా పేరు మార్చాలని వ్యాఖ్యానించ‌టంపైనా పోలీసులు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

స్వామి ప‌రిపూర్ణ‌నంద చేతిలో నోటీసులు పెట్టి గుర్తు తెలియ‌ని ప్రాంతానికి తీసుకెళ్లినట్లుగా ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాది చెబుతున్నారు. ఆర్నెల్ల వ‌ర‌కూ న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ వేటు వేసిన పోలీసులు.. ఆర్నెల్ల త‌ర్వాత కూడా ముంద‌స్తు అనుమ‌తి తీసుకున్న త‌ర్వాత న‌గ‌రంలో అడుగు పెట్టాల్సి ఉంటుంద‌ని చెప్పిన‌ట్లుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది.