Begin typing your search above and press return to search.

వాజ్ పేయ్ హెల్త్ బులెటిన్ రాలేదెందుకు?

By:  Tupaki Desk   |   13 Jun 2018 4:54 AM GMT
వాజ్ పేయ్ హెల్త్ బులెటిన్ రాలేదెందుకు?
X
ప్ర‌ముఖుల ప‌రిస్థితి చూస్తే కొన్నిసార్లు ఆశ్చ‌ర్యంతో ఉంటుంది. ప్ర‌ముఖులు బాగున్నంత వ‌ర‌కూ ఓకే. వారికేమైనా అనుకోనిది జ‌రిగినా.. వారి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించినా.. వారికి సంబంధించిన నిర్ణ‌యాల‌న్నీ వారికి చెందిన వారికే వ‌చ్చేస్తాయి. వారిని ఎంత‌గానో అభిమానించి.. ఆరాధించే కోట్లాది మంది ప్ర‌జ‌ల‌కు క‌నీస స‌మాచారం తెలీని ప‌రిస్థితి ఉంటుంది.

అభిమానించ‌టం అనే బంధంతో ప్ర‌ముఖుల్ని ఆరాధించే ప్ర‌జ‌ల‌కు.. వారికి సంబంధించి ముఖ్య‌మైన స‌మాచారం అందించే విష‌యంలో సెన్సార్ అనుస‌రించే విధానం ప్ర‌జ‌ల ఆశ‌ల‌కు భిన్నంగా ఉంటుంద‌ని చెప్పాలి. ఆ మ‌ధ్య‌న అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన అమ్మ జ‌య‌ల‌లిత వివ‌రాలు ఎంత వ‌ర‌కు బ‌య‌ట‌కు వ‌చ్చాయో తెలిసిందే.

తాము అభిమానించి.. ఆరాధించే అమ్మ ఎలా ఉంద‌న్న దానికి సంబంధించిన ఫోటోను విడుద‌ల చేయ‌టానికి కూడా స‌సేమిరా అనటం తెలిసిందే. అప‌స్మార‌క స్థితిలో ఆసుప‌త్రిలో చేరిన ఆమె.. చివ‌ర‌కు అంద‌నంత దూరాల‌కు వెళ్లిన గంట‌ల త‌ర్వాతే ప్ర‌జ‌ల‌కు ఆమెను చూసే భాగ్యం ద‌క్కింది.

తాజాగా చూస్తే.. మాజీ ప్ర‌ధానిగా.. పార్టీల‌కు అతీతంగా అభిమానాన్ని సొంతం చేసుకున్న వాజ్ పేయ్ అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరారు. రోటీన్ టెస్టుల కోసం ఆయ‌న ఆసుప‌త్రిలో చేరిన‌ట్లుగా ప్ర‌క‌టించారు. కానీ.. బీజేపీ ప్ర‌ముఖుల‌తో స‌హా.. రాజ‌కీయ ప్ర‌ముఖులు ఎయిమ్స్ కు పోటెత్త‌టం చూస్తే..ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిలో ఏదో తేడా వ‌చ్చింద‌నే చెప్పాలి. ఒక‌వేళ‌.. వాజ్ పేయ్ మీద అభిమానంతోనే ఇలా ఆసుప‌త్రికి వ‌చ్చార‌నుకుందాం. అదే నిజ‌మైతే.. ఇంట్లో నుంచి కొన్నేళ్లుగా బ‌య‌ట‌కు రాని వాజ్ పేయ్ ను ఇదే నేత‌లు ఎందుకు త‌ర‌చూ ప‌రామ‌ర్శించ‌రు? అన్న‌ది ప్ర‌శ్న‌.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం వాజ్ పేయ్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. శ్వాస‌కోస‌.. మూత్ర‌పిండాల వ్యాధుల‌తో బాధ ప‌డుతున్న ఆయ‌న్ను సోమ‌వారం ఎయిమ్స్ కు త‌ర‌లించ‌టం తెలిసిందే. తొలుత రోటీన్ చెకప్ ల కోస‌మ‌ని చెప్పినా.. త‌ర్వాత ఆ విష‌యాన్ని వ‌దిలేసి.. ఆయ‌న హెల్త్ బులిటెన్లు ఇవ్వ‌టం షురూ చేశారు. వాజ్ పేయ్ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు ఎయిమ్స్ డైరెక్ర్ ర‌ణ్ దీప్ గులేరా నేతృత్వంలోని ప్ర‌త్యేక వైద్య బృందం చెబుతోంది.

మంగ‌ళ‌వారం ఉద‌యం హెల్త్ బులిటెన్ ను రిలీజ్ చేసిన ఎయిమ్స్ సాయంత్రానికి మాత్రం ఎలాంటి బులిటెన్ ను విడుద‌ల చేయ‌క‌పోవ‌టంపై అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయి. వాజ్ పేయ్ కున్న ఏకైక కిడ్నీ.. ఊపిరితిత్తులు అంతంత మాత్రంగా ప‌ని చేయ‌టం.. ఆ విష‌యాన్ని బులిటెన్ లో పేర్కొన‌టం ఇష్టం లేక‌నే విడుద‌ల చేయ‌లేద‌న్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు.. వాజ్ పేయ్ ఆరోగ్య ప‌రిస్థితి బాగోలేద‌న్న మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే మాజీప్ర‌ధానులు మ‌న్మోహ‌న్‌.. దేవ‌గౌడ‌ల‌తో పాటు.. సంఘ్ ప‌రివార్ అధినేత మోహ‌న్ భ‌గ‌వ‌త్ .. ప‌లువురు కేంద్ర‌మంత్రులు ఎయిమ్స్ కు వ‌చ్చి వాజ్ పేయ్ ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మ‌రోవైపు వాజ్ పేయ్ ఆరోగ్యం కుదుట‌ప‌డాల‌ని కోరుతూ.. ప‌లువురు బీజేపీ కార్య‌క‌ర్త‌లు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు.