Begin typing your search above and press return to search.

కోదండరాం తప్పుకుంది అందుకేనా?

By:  Tupaki Desk   |   18 Nov 2018 7:50 AM GMT
కోదండరాం తప్పుకుంది అందుకేనా?
X
కోదండరామ్ కు ఓటమి భయం వెంటాడిందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ విషయంలో హితబోధ చేసిన కాంగ్రెస్ మరింత భయపెట్టి పోటీలో ఉండకుండా చేయడంలో విజయం సాధించింది. ఇక్కడో.. అక్కడో పోటీ చేస్తారని వస్తున్న ఊహగానాలకు తెరదించుతూ - పొన్నాలకు లైన్ క్లియర్ చేసేశారు.

టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో టీజేఎస్ దే ప్రధాన భూమికగా ఉన్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ తరువాత కేటాయించిన సీట్లలో అతి తక్కువగా ఉండటం, ప్రాధాన్యంగా తగ్గుతూ వస్తుండటంతో కూటమి వీడుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, కోదండరాం మహా కూటమిలోనే ఉన్నారు. సీట్ల ఎంపిక జరిగిపోయింది. కోదండరామ్ పోటీ ఎక్కడ నుంచి చేస్తారోనని, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు అన్ని పార్టీల అభ్యర్థులు ఆసక్తిగా గమనించారు.

జనగాం నుంచి కోదండరామ్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఇక్కడ రెడ్డి ఓటింగ్ ఎక్కువ. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున పోటీ చేసి గెలుపొందిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఈ సారి మరలా పోటీ చేస్తున్నారు. ఈయనపై వ్యతిరేకత ప్రజల్లో ఎక్కువగానే ఉంది. కాబట్టి జనగాం నుంచి కోదండరామ్ పోటీ చేస్తే విజయం తప్పక లభిస్తుందని భావించారు. మరోవైపు ఇక్కడి నుంచి అభ్యర్థిత్వం కోసం కాంగ్రెస్ పార్టీ తరుపున పొన్నాల లక్ష్మయ్య చాలా ప్రయత్నాలు చేశారు. మొదటి, రెండో జాబితాలో ఈయన పేరు లేకపోవడంతో కార్యకర్తల నుంచి భారీగా అసంతృప్తి వ్యక్తమైంది.

ఈ క్రమంలో రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోదండరామ్ కు హితబోధ చేసిందని ప్రచారం జరుగుతోంది.. మొదటసారి బరిలోకి దిగి గెలుపొందకపోతే - అభాసుపాలవుతారని, కాబట్టి పోటీలో ఉండకపోవడమే బెటర్ అని చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టాలని అనుకుంటున్న కామన్ మినిమమ్ ప్రోగ్రాం కు ఛైర్మన్ గా నియమిస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం హామీ ఇచ్చింది. దాంతో ఓడిపోతాడన్న భయంతోనే కోదండ బరిలోకి దిగలేదని ప్రచారం హోరెత్తుతోంది. ఓడి ప్రజల్లో అభాసుపాలుకాకుండా ఉండేందుకే బరిలోంచి తప్పుకుంటే మంచిదని భావించినట్టు సమాచారం.ఈ కారణాలతో పోటీలో నుంచి కోదండరాం తప్పుకున్నారట. అలా పొన్నాలకు లైన్ క్లియర్ చేసేశారు.